‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్లాన్ మారిందా..?

0

‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ”సర్కారు వారి పాట”. ఇందులో మహేష్ కి జోడీగా ‘మహానటి’ కీర్తి సురేష్ నటించనుంది. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మించనున్నాయి. మే నెలలో అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ని లాక్ డౌన్ కారణంగా సెట్స్ మీదకు తీసుకెళ్లలేక పోయారు. ఇప్పుడు అన్ని సినిమాల షూటింగ్స్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ చిత్రాన్ని జనవరి నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం ముందుగా యూఎస్ లో భారీ షెడ్యూల్ కి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ప్లాన్స్ చేంజ్ అవుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

బ్యాంక్ స్కామ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం కోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వేస్తున్నారట. జనవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టి నిర్విరామంగా నెల రోజుల పాటు షూట్ చేయనున్నారట. యూఎస్ లో షూటింగ్ కి పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో అనే అనుమానంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తైన తర్వాత యూఎస్ షెడ్యూల్ ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ లుక్ మరియు క్యారక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉండబోతోంది. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ తో ఈ విషయం అర్థమైంది. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా వస్తున్న ‘సర్కారు వారి పాట’ పై అటు మహేష్ ఫ్యాన్స్ లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.