శ్రీవాస్ -ఎన్బీకే ప్రాజెక్ట్ ఎంతవరకొచ్చింది?

0

నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సింహా – లెజెండ్ తర్వాత మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ జోడీ నుంచి వస్తోంది. ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తయింది. లాక్ డౌన్ వల్ల ఆలస్యమైంది కానీ ఈపాటికే మొత్తం షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది.

తాజా సమాచారం ప్రకారం.. సమ్మర్ 2021 విడుదలకు సిద్ధం చేయాలని బోయపాటి శ్రీను భావిస్తున్నారట. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఇంకా ఏఏ సినిమాలు చేస్తున్నారు? అంటే మరో ముగ్గురు దర్శకులు ఆయనకు స్క్రిప్ట్ వినిపించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇందులో ప్రముఖంగా బి.గోపాల్.. శ్రీవాస్.. పూరి జగన్నాథ్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు బి గోపాల్ తో బాలయ్య ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం పూర్తవుతోంది. అలాగే శ్రీవాస్ స్క్రిప్ట్ కి బాలకృష్ణ తన అనుమతి ఇచ్చారు. బాలకృష్ణ – శ్రీవాస్ కాంబినేషన్ గతంలో డిక్టేటర్ కోసం పనిచేశారు. ఈ చిత్రం సగటు కంటే తక్కువ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత బెల్లంకొండతో శ్రీవాస్ సాక్ష్యం చేసినా అది డిజాస్టరైంది.

ప్రస్తుతం కోన వెంకట్ తో కలిసిన శ్రీవాస్ స్క్రిప్ట్ పై పనిచేసి ఇటీవల బాలకృష్ణను ఆకట్టుకున్నాడు. బాలకృష్ణ బి గోపాల్ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి సరైన సమయం చూసి ప్రకటిస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలయ్యబాబుకు స్క్రిప్టు వినిపించేందుకు పూరి జగన్నాథ్ ఆసక్తిగా ఉన్నారని ఇటీవల కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.