బాలయ్య సరసన అఖిల్ హీరోయిన్..!

0

నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఆ మధ్య వచ్చిన ఫస్ట్ రోర్ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే తిరిగి ప్రారంభించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నారని తెలుస్తోంది. అందులో ఒకటి అఘోరా పాత్ర అని సమాచారం. ఇక ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ‘అవును’ ఫేమ్ పూర్ణ ని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా BB3 కోసం మరో గ్లామరస్ హీరోయిన్ ను ఎంపిక చేశారు.

అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీ ‘అఖిల్’ తో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైన సయాషా సైగల్ ని ఇప్పుడు బాలయ్య కు జోడీగా తీసుకున్నారు. ‘అఖిల్’ చిత్రంతో అలరించిన సయాషా కి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. హిందీలో అజయ్ దేవగన్ తో ‘శివాయ్’.. తమిళ్ లో కార్తీ సరసన ‘చినబాబు’.. సూర్యతో కలిసి ‘బందిపోటు’ సినిమాల్లో నటించింది. అలానే ‘గజినీకాంత్’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆర్య ను సయాషా సైగల్ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా నటిస్తున్న సయాషా ప్రస్తుతం కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో కలిసి ‘యువరత్న’ సినిమాలో నటిస్తోంది. అలానే తన భర్త ఆర్య తో ‘టెడ్డీ’ అనే తమిళ్ సినిమా చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు బాలకృష్ణ – బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. మరి ఈ బ్యూటీకి ఈ చిత్రం తెలుగులో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.