భారతీయుడు 2 నుంచి తప్పుకున్న శంకర్?

0

భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆది నుంచి రకరకాల సమస్యలతో వాయిదాల ఫర్వంలో సాగుతున్న సంగతి తెలిసిందే.

2.0 పరాజయం అనంతరం లైకా సంస్థ భారీ బడ్జెట్లను వెచ్చించేందుకు శంకర్ అడిగినంతా ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. అయితే బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీకి రాని శంకర్ కి అది ఎంతమాత్రం గిట్టడం లేదు. ఆరంభం కమల్ హాసన్ కి మేకప్ పరమైన అలెర్జీ సమస్యలు వెంటాడాయి. ఆ తర్వాత కాజల్ కి ఆ తరహా అలెర్జీ సమస్య తలెత్తిందని అన్నారు. దానివల్ల కొద్దిరోజులు షూటింగ్ ఆపేశారు.

అక్కడితో అయిపోలేదు.. ఆ తర్వాత భారీ క్రేన్ విరిగిపడి శంకర్ శిష్యులు .. సెట వర్కర్స్ మరణించడం చిత్రబృందాన్ని లైకా సంస్థను కుంగదీసింది. శంకర్ .. కమల్ హాసన్ ఈ విషయంలోనూ లైకా సంస్థతో ఘర్షణ పడ్డారు. లైకా నాశిరకం సౌకర్యాల వల్లనే ఇలా జరిగిందని ఆ ఇద్దరూ ఆరోపించడం సంచలనమైంది. అటుపైనా శంకర్ కమల్ హాసన్ లను బుజ్జగించడం ద్వారా తిరిగి మూవీని పట్టాలెక్కించారు.

ఇంతలో ఊహించని పిడుగులా కరోనా మహమ్మారీ విరుచుకుపడడంతో ఆరేడు నెలలుగా షూటింగులు ఆపేయాల్సిన దుస్థితి తలెత్తింది. దీనివల్ల లైకా సంస్థకు భారీ నష్టం తలెత్తిందని తెలుస్తోంది. ఆ క్రమంలోనే శంకర్ తో మరోసారి బడ్జెట్ విషయంలో చర్చలు సాగాయి. ఆ చర్చల్లో మాటా మాటా పెరగడంతో శంకర్ హర్టయ్యారని తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభించేందుకు లైకా ముందుకు రాకపపోవడంతో శంకర్ సీరియస్ అయ్యారట. అంతేకాదు.. తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటానని అన్నారని .. అలాగే వేరొక సినిమాని వెంటనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నానని అన్నారని కూడా ప్రచారం సాగుతోంది. అయితే భారతీయుడు 2 (ఇండియన్ 2) నుంచి శంకర్ తప్పుకున్నట్టు లైకా కానీ శంకర్ కానీ అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై లైకా నుంచి స్పష్ఠమైన సమాచారం వచ్చాకే కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది.