నేచురల్ స్టార్ నాని ”శ్యామ్ సింగ రాయ్” అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. ఇందులో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి – గార్జియస్ కృతి శెట్టి – మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించనున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో నేటి (డిసెంబర్ 21) నుంచి ‘శ్యామ్ సింగ రాయ్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించినట్లు మేకర్స్ ప్రకటించారు. చిత్ర యూనిట్ దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా వదిలింది.
కాగా ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. ఈ చిత్రానికి జంగా సత్యదేవ్ పవర్ ఫుల్ స్టోరీ అందిస్తున్నారు. మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె.మేయర్ సంగీతం సమకూర్చనున్నాడు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. ఇందులో నాని ఇంతకముందు చేయని ఛాలెంజింగ్ రోల్ లో కనిపించనున్నాడు. నాని 27వ చిత్రమైన ‘శ్యామ్ సింగ రాయ్’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే.. సుందరానికీ!’ సినిమా చేయనున్నాడు. ఇక ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటిస్తున్న ‘టక్ జగదీష్’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.