Templates by BIGtheme NET
Home >> Cinema News >> డిసెంబర్ 20న విడుదల కానున్న సోలో బ్రతుకే సో బెటర్..?

డిసెంబర్ 20న విడుదల కానున్న సోలో బ్రతుకే సో బెటర్..?


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ”సోలో బ్రతుకే సో బెటర్”. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు లిరికల్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుని క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ పొందింది. అయితే ఇన్నాళ్లు థియేట్రికల్ రిలీజ్ లేదా డిజిటల్ రిలీజ్ అనే దానిపై డైలామాలో ఉన్న మేకర్స్ ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

కరోనా కారణంగా థియేటర్స్ క్లోజ్ అవడంతో మూవీస్ అన్నీ డైరెక్ట్ ఓటీటీలలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని కూడా జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా మరికొన్ని రోజుల్లో థియేటర్స్ అన్నీ ఓపెన్ అయ్యే అవకాశం ఉండటంతో ఇప్పుడు ముందుగా థియేట్రికల్ రిలీజ్ చేసి ఆ తర్వాత డిజిటల్ రిలీజ్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో పరిస్థితులు అనుకూలిస్తే ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. ‘చిత్రలహరి’ ‘ప్రతిరోజు పండగే’ వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక హీరోయిన్ నభా నటేశ్ కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకుంది. ‘డిస్కోరాజా’ ప్లాప్ తర్వాత నభా నటిస్తున్న ఈ సినిమా రిజల్ట్ పై ఆమె కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు. మరి సాయి తేజ్ – నభా లకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.