Templates by BIGtheme NET
Home >> Cinema News >> SP బాలసుబ్రమణ్యం బయోపిక్ .. ఆ ఒక్కటే అడ్డంకి!

SP బాలసుబ్రమణ్యం బయోపిక్ .. ఆ ఒక్కటే అడ్డంకి!


గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆకస్మిక అంతర్థానం అభిమానుల్ని తీవ్రంగా కలచివేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఒక ఆసుపత్రిలో కోవిడ్ 19 సంబంధిత సమస్యలతో సుదీర్ఘ పోరాటం తరువాత నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గత ఏడాది సెప్టెంబర్ 25 న అంతిమ శ్వాస విడిచారు. ఆ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులను కలచివేసింది. ఇప్పుడు ఈ అనుభవజ్ఞుడైన గాయకుడిపై బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.

ఎస్పీబీకి నివాళిగా ఇటీవల నిర్వహించిన హృదయంజలి సంగీత కార్యక్రమంలో శుభోదయం గ్రూప్ చైర్మన్ శ్రీ లక్ష్మి ప్రసాద్ తన కుటుంబ సభ్యులు అనుమతి ఇస్తే ఎస్పీ బాలసుబ్రమణ్యంపై బయోపిక్ నిర్మిస్తానని అన్నారు. అయితే లక్ష్మి ప్రసాద్ అభ్యర్థనపై ఎస్పీబీ కుటుంబ సభ్యులు ఇంకా స్పందించాల్సి ఉంది.

పాటల పూదోటలో అలుపెరగని విహారిగా వేలాది పాటల్ని ఆలపించిన ఎస్పీ బాలు ఎన్నో అవార్డులు రివార్డులతో రికార్డులకెక్కారు. ఇంచుమించు దేశంలోని అన్ని భాషల్లోనూ పాడారు. బాలు నటుడిగానూ రాణించారు. ముఖ్యంగా పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎందరో యువ ప్రతిభావంతులను గాయకులుగా వెలుగులోకి తెచ్చారు. వీటన్నిటినీ మించి వ్యక్తిగత జీవితంలో ఆదర్శవంతమైన జీవనంతో అందరివాడయ్యారు. అందుకే బాలు బయోపిక్ పైనా ప్రజల్లో ఆసక్తి నెలకొంది.