యంగ్ హీరోకు చిరు వాయిస్ మెసేజ్.. అతడి భార్యకు మెగా ప్రశంసలు

0

మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్లో ఎంతో మంది హీరోలు కూడా ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల జరిగిన చిరంజీవి పుట్టిన రోజుకు పలువురు సినీ ప్రముఖులు మరియు నటీనటులు శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెల్సిందే. అయితే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ హీరో సుధాకర్ కోమాకుల మాత్రం తన అభిమాన మెగాస్టార్ కోసం ప్రత్యేకంగా ఏమైనా చేయాలనే ఉద్దేశ్యంతో భార్య హారికతో కలిసి చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ ల్లో ఒకటి అయిన ఇందువదన పాటకు కవర్ వీడియో చేసిన విషయం తెల్సిందే.

ఈ జంట చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్స్ చేశారు. సుధాకర్ మరియు హారికలు కోరుకున్నట్లుగానే ఆ వీడియో చిరంజీవి వరకు వెళ్లింది. అమెరికాలో పలు లొకేషన్స్ లో అచ్చు పాత పాట ఉన్నట్లుగా తీసుకు రావడానికి వారు పడ్డ కష్టంను చిరంజీవి గుర్తించారు. వారిని అభినందిస్తూ వాయిస్ మెసేజ్ ను చిరంజీవి పంపించారు. అందులో చిరంజీవి పలు విషయాలను ప్రస్థావించారు. ముఖ్యంగా మీ జంట చూడముచ్చటగా ఉందని చెప్పడంతో పాటు హారికను అభినందించాడు.

నువ్వు అంటే హీరోవు డాన్స్ లు చేయగలవు. ఒక ఐటీ అమ్మాయి అయ్యి ఉండి హారిక అంత బాగా డాన్స్ చేయడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఈ విషయంలో నీ కంటే హారికకు ఎక్కువ మార్కులు వేస్తున్నాను. మీ దంపతులు ఇద్దరు కూడా చక్కని అనుసంధానంతో స్టెప్పులు వేశారు. ఇలాగే జీవితంలో కూడా ఒకరికి ఒకరు సమన్వయంతో చక్కని అనుబంధంతో ముందుకు వెళ్లాలని నా గుడ్ విషెష్ ను మీకు అందజేస్తున్నాను అంటూ చిరు చెప్పుకొచ్చారు. చిరు వాయిస్ ను సుధాకర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. మా వీడియోకు మీరు స్పందించినందుకు చాలా కృతజ్ఞతలు అంటూ సుధాకర్ ట్వీట్ లో పేర్కొన్నాడు.

MEGASTAR’s response for a mini attempt! #MegastarChiranjeevi garu for a reason!