సుధీర్ బాబుతో మరో పలాస

0

సుధీర్ బాబు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘వి’ సినిమా నిరాశ పర్చింది. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా సుధీర్ బాబు పాత్ర మరియు అతడి సిక్స్ ప్యాక్ కు మంచి మార్కులు పడ్డాయి. వి సినిమా ఫలితం నుండి బయటకు వచ్చేసిన సుధీర్ బాబు కొత్త సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇన్ని రోజులు కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ కు దూరంగా ఉన్న సుధీర్ బాబు అతి త్వరలోనే మళ్లీ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. ఈయన తాజాగా దర్శకుడు కరుణ కుమార్ కు ఓకే చెప్పాడట. వీరిద్దరి కాంబోలో ఒక వింటేజ్ ఎంటర్ టైనర్ తెరకెక్కబోతున్నట్లుగా మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

పలాస వంటి సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యాడు. 1980 బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పలాస సినిమా థియేటర్లలో విడుదలైంది. లాక్ డౌన్ కారణంగా వెంటనే ఓటీటీలో విడుదల చేశారు. రెండు చోట్ల కూడా పలాస మంచి స్పందన దక్కించుకుంది. పలాస తరహాలోనే ఒక పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో కరుణ కుమార్ కథను రెడీ చేసుకున్నాడట. ఆ కథకు సుధీర్ బాబు ఓకే చెప్పడంతో త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుంది. పలాస మరియు రంగస్థలం సినిమాలను మిక్స్ చేసినట్లుగా ఈ సినిమా ఉంటుందట అంటూ మీడియా వర్గాల వారు అంటున్నారు. ఏది ఏమైనా ప్రతిభ ఉన్న దర్శకుడు అవ్వడంతో సుధీర్ బాబుకు ఒక మంచి సినిమాను కరణ్ కుమార్ ఇస్తాడని అంతా నమ్మకం పెట్టుకున్నారు.