సాహో డిలీట్ సీన్ కి సొంతంగా వీఎఫ్ఎక్స్ చేయిస్తా..ఫ్యాన్స్ కి చూపిస్తా!

0

సాహో.. బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి అఖండ విజయం తర్వాత ప్రభాస్ చేసిన సినిమా సాహో. ఈ సినిమా విడుదలకు ముందే బాహుబలి ద్వారా వచ్చిన క్రేజ్ తో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద స్టార్ హీరో అయ్యాడు. అందుకే సాహో సినిమా కి అంచనాలు ఆకాశాన్ని అంటాయి. రన్ రాజా రన్ తర్వాత రెండో సినిమాకే ప్రభాస్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్న సుజిత్.. అంతపెద్ద స్టార్ ని డీల్ చేసే ఒత్తిడిలో కాస్త గతి తప్పాడు. తెలుగులో సాహో సినిమా సో సో గానే ఆడగా బాలీవుడ్లో మాత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది.

ఈ మూవీ తర్వాత డైరెక్టర్ సుజిత్ మరో మూవీని అంగీకరించలేదు. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ను మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ రీమేక్ బాధ్యతలను చిరంజీవి డైరెక్టర్ సుజిత్ కి అప్పగించాడు. అయితే ఫైనల్ వెర్షన్ స్క్రిప్టు సుజిత్ వినిపించగా చిరంజీవికి నచ్చకపోవడంతో దాన్ని పక్కన పెట్టేశారనే వార్తలు వినిపించాయి. కాగా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో ఎంట్రీ కి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ప్రభాస్ కి సూపర్ హిట్ గా నిలిచిన ఛత్రపతి సినిమాను హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ తన ఆరంగేట్రానికి ఎంచుకున్నాడు. ఆ సినిమా కోసం ప్రత్యేకంగా తన గెటప్ ని కూడా పూర్తిగా మార్చుకున్నాడు. ఈ సినిమాని హిందీలో సుజిత్ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

కాగా డైరెక్టర్ సుజిత్ ఇవాళ ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ ప్రభాస్ అభిమాని సాహో లో డిలీట్ చేసిన సీన్ ని విడుదల చేయాలని సుజిత్ ని కోరాడు. ‘యోవ్.. సాహో డిలీట్ సీన్స్ ఎప్పుడు ఇస్తావ్ అన్నా ‘ అని ఓ అభిమాని సుజిత్ ని ప్రశ్నించాడు. దీనికి సుజిత్ రిప్లై ఇస్తూ ‘ ఓయ్ అన్నో.. నేనే కదా ట్రై చేసి రిలీజ్ చేస్తా అన్నా.. సీన్ ఉంది రా.. స్వామి.. దానికి బేసిక్ వీఎఫ్ఎక్స్ చేయించాలి.. కోవిడ్ వల్ల ఆ కంపెనీ లేదు. నా పైసలతో నేనే చేస్తా ఓపిక పట్టు.’ అని సమాధానం ఇచ్చాడు. అభిమాని సుజిత్ మధ్య జరిగిన ఈ చాట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా సుజిత్ తాను ఇప్పుడు లూసిఫర్ రీమేక్ కానీ ఛత్రపతి హిందీ రీమేక్ బాధ్యతలు కానీ చేపట్టలేదని వెల్లడించాడు.