హీరోయిజం చూపిస్తాడా లేదా విలనిజం చూపిస్తాడా…?

0

టాలీవుడ్ సీనియర్ హాస్యనటుడు సునీల్ ఆ మధ్య కామెడీ వేషాలు మానేసి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా సునీల్ హీరోగా నటించిన సినిమాలు ఏవీ విజయం సాధించకపోవడంతో హీరో వేషాలు పక్కనపెట్టి మళ్ళీ కమెడియన్ కమ్ క్యారక్టర్ ఆర్టిస్టుగా కంటిన్యూ అవుతున్నాడు. ఈ క్రమంలో విలన్ రోల్స్ కూడా పోషిస్తున్నాడు. ‘డిస్కో రాజా’ మూవీలో విలన్ గా నటించిన సునీల్.. ఇప్పుడు మరో కమెడియన్ సుహాస్ ‘కలర్ ఫోటో’ సినిమాలో కూడా పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు సునీల్ మళ్ళీ హీరోగా నటించడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకి ”వేదాంతం రాఘవయ్య” అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇప్పుడు విలన్ వేస్తున్న సునీల్ ఈ సినిమాలో హీరోయిజం చూపించబోతున్నాడో.. డబుల్ రోల్ చేసి హీరోయిజం ప్లస్ విలనిజం చూపించబోతున్నాడో చూడాలి.

కాగా ”వేదాంతం రాఘవయ్య” సినిమాకి మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ వర్క్ చేయనున్నాడు. కాకపోతే హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం లేదు. అయితే ‘వేదాంతం రాఘవయ్య’ చిత్రానికి కథను అందించడంతో పాటు చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇంతకముందు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ రామ్ ఆచంట – గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రకటించిన మేకర్స్ దర్శకుడు ఎవరనేది అనౌన్స్ చేయలేదు. దీంతో హరీష్ ఏమైనా ఈ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందా అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే హరీష్ పవన్ కళ్యాణ్ నటించబోయే తదుపరి చిత్రాన్ని డైరెక్ట్ చేస్తారని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. అయితే ప్రస్తుతం పవన్ ‘వకీల్ సాబ్’ సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. దీని తర్వాత క్రిష్ సినిమాలో పాల్గొంటాడని తెలుస్తోంది. మరి ఈలోపు సునీల్ సినిమాని హరీష్ పూర్తి చేసే అవకాశాలు లేకపోలేదని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. మరోవైపు రేపు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా PSPK28 అప్డేట్ ఇవ్వబోతున్నట్లు హరీష్ శంకర్ ప్రకటించారు. రేపు వచ్చే అప్డేట్ ని బట్టి సునీల్ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.