Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్’.. రీలాంచ్ చేసిన సూపర్ స్టార్

‘విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్’.. రీలాంచ్ చేసిన సూపర్ స్టార్


ఇటీవల టాలీవుడ్ లో ఫిలిం స్టూడియోల నిర్మాణంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి .. అల్లు అరవింద్ – బన్ని జోడీ.. ఇప్పటికే హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో ఫిలింస్టూడియోల నిర్మాణం చేపడుతుండడం సర్వత్రా ఆసక్తికర చర్చకు తావిచ్చింది.

ఇక తేదేపా ప్రభుత్వం హయాంలో నందమూరి బాలకృష్ణ విశాఖలో ఫిలిం స్టూడియో నిర్మిస్తారని ప్రచారమైంది. ఇటీవలే ఏపీ సీఎంని కలిసిన చిరంజీవి వైజాగ్ లో భారీ ఫిలింస్టూడియో ప్లాన్ చేశారని ముచ్చటించుకున్నారు. ఆ క్రమంలోనే ఘట్టమనేని ఫ్యామిలీ ఫిలిం స్టూడియో నిర్మించేది ఎపుడు? సూపర్ స్టార్ మహేష్ ఏదైనా భారీ స్టూడియోని నిర్మించే యోచన చేస్తున్నారా? అంటూ ఆసక్తికర ముచ్చటా సాగింది.

అయితే భారీ ఫిలిం స్టూడియో కాదు.. కానీ ఘట్టమనేని ఫ్యామిలీ యువ హీరో ఓ ఫిలిం స్టూడియోని ప్రారంభించడం ఫిలింనగర్ లో చర్చకు తావిచ్చింది. శ్రీ విజయ కృష్జ బ్యానర్ స్థాపించి దాదాపు 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా.. సూపర్ స్టార్ కృష్ణ వారసుడు సీనియర్ నరేష్..అలాగే కృష్ణ మనవడు నవీన్ విజయ కృష్ణ కలిసి విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ప్రవేట్ లిమిటెడ్ పేరుతో రీలాంచ్ చేశారు. సూపర్ స్టార్ స్వయంగా రిబ్బన్ కట్ చేసి ఆశీస్సులు అందించారు. హీరో సుధీర్ బాబు ఛైర్మన్ ఛాంబర్… కాన్ఫరెన్స్ హాల్ ను ప్రారంభించారు. శ్రీమతి ప్రియ సుధీర్ పాలు పొంగించారు. శ్రీ విజయ నిర్మల తమ్ముళ్లు రవికుమార్… రామనాధ్ అడ్మిన్ .. రిసెప్షన్ బ్లాక్స్ ను ప్రారంభించారు. వైస్ ప్రెసిడెంట్ నవీన్ విజయ కృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

నిజానికి 1972లోనే ఈ సంస్థ లాంచ్ అయ్యింది. కృష్ణ- విజయ నిర్మల జోడీ ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన క్లాసిక్ చిత్రాలు నిర్మించారు. మీనా- హేమా హేమీలు- అంతంకాదిది ఆరంభం వంటి సూపర్ హిట్స్ ని నిర్మించారు. విజయ నిర్మలను గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ గా నిలబెట్టిన బ్యానర్ కూడా ఇదే. అప్పట్లోనే షూటింగుల కోసం స్టూడియో.. డబ్బింగ్ .. ఎడిటింగ్ వంటి నిర్మాణానంతర పనులన్నిటి కోసం ఈ ల్యాబ్ కం స్టూడియోని వినియోగించారు. ఇప్పుడు మళ్లీ అదే స్టూడియోని రీలాంచ్ చేశారు. ఇక ఫిలింనగర్ పరిసరాల్లోని సూపర్ స్టార్ కృష్ణకు చెందిన పద్మాలయా స్టూడియోస్ ని పడగొట్టి ఆ స్థలంలో వేరే నిర్మాణాలు చేపడుతున్న సంగతి విధితమే.