ప్రతిష్ఠను దిగజార్చొద్దని సురేఖావాణి కుమార్తె ఆవేదన

0

నేపథ్యగాయని సునీత రెండో వివాహం అనంతరం అనూహ్యంగా మరో కొత్త పుకార్ టాలీవుడ్ లో షికార్ చేసింది. గత కొన్ని రోజులుగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి వ్యక్తిగతంగా మరో ముందడుగు వేస్తున్నారని త్వరలోనే రెండో వివాహానికి సిద్దమవుతున్నారని తామరతంపరగా మీడియాలో ప్రచారం అయిపోయింది.

అయితే ఇది పుకార్ మాత్రమేనని .. ఇలాంటి వార్తలు తమ ప్రతిష్ఠను మంటకలుపుతాయని సురేఖావాణి కుమార్తె సుప్రీత ఆవేదన చెందారు. ఇప్పటికే సురేఖా ఆ గాసిప్పుల్ని ఖండించారు. అయినా ఇంకా పుకార్లు ఆగకపోవడంతో ఈ అనవసరమైన విషయాలకు చెక్ పెట్టేందుకు తన కుమార్తె సోషల్ మీడియాల్లోకి వచ్చారు. నిజాల్ని వార్తలుగా ఇవ్వాలని.. క్రొత్త విషయాలను సృష్టించవద్దని కోరిన సుప్రీత.. మీ ఆదాయం కోసం మీరు ఒకరి ప్రతిష్టను మంటకలిపడమే గాక.. పవిత్రమైన వృత్తిని చంపుతున్నారని .. కనీసం మిమ్మల్ని జర్నలిస్టులు అని అనుకోవద్దని కూడా సీరియస్ అయ్యారు.

సెలబ్రిటీలపై ఇలాంటి గాసిప్పులు వ్యాపించినప్పుడు అవి నిజమా కాదా? అనేది నేరుగా సదరు వ్యక్తికి ఫోన్ చేసి తెలుసుకోవడం వృత్తిలో శిక్షణ పొందిన వారు చేస్తుంటారు. కానీ ఇటీవల డిజిటల్ మీడియా వెల్లువలో ఎలాంటి నిర్ధారణ లేకుండా ప్రచురించడం వల్లనే ఈ సమస్య తలెత్తుతోంది. ఏదేమైనా కానీ సురేఖా వాణి కుటుంబ సభ్యులు దీనిపై హర్టయ్యారని అర్థమవుతోంది. తన తల్లిపై ఇలాంటి వార్తలు రావడం కుమార్తెను బాధించింది. అందుకే ఇలా మీడియాపై రుసరుసలాడారు.