ఇప్పట్లో షూటింగ్స్ చేయలేమంటున్న స్టార్ ప్రొడ్యూసర్…?

0

కరోనా మహమ్మారి దెబ్బకు అతలాకుతలమైన రంగాల్లో సినీ రంగం ఒకటి. సినిమా షూటింగ్స్ నిలిపివేయబడి థియేటర్స్ క్లోజ్ అవడంతో సినిమాపై ఆధారపడి జీవించే వేలాది మంది పై ఎఫెక్ట్ పడింది. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగులు చేసుకోవచ్చని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రోజుల క్రితమే అనుమతినిచ్చాయి. కొన్ని సినిమాలు టీవీ షోలు సీరియళ్ల షూటింగ్ స్టార్ట్ చేసారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా టెలివిజన్ మరియు సినిమా షూటింగులకు అనుమతినిచ్చింది. అయితే కరోనా రోజురోజుకి ఎక్కువ అవుతున్న కారణంగా స్టార్స్ ఎవరూ షూటింగుల్లో పాల్గొనడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు సినిమా షూటింగులకు అనుమతులు ఇవ్వమని ప్రభుత్వాలతో చర్చలు జరిపిన నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

సురేష్ బాబు నిర్మించే సినిమాల షూటింగ్ మరో రెండు మూడు నెలల వరకు ప్రారంభించలేమని స్పష్టం చేశారట. యాక్షన్ సీన్స్ షూట్ చేయాల్సి ఉండగా దాదాపుగా 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో కలిపి సెట్ లో కనీసం 150 మంది ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని.. వారంతా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ చేయడం సాధ్యం కాదని చెప్పారట. నటీనటులు టెక్నీషియన్స్ ఆరోగ్యమే అన్నిటికన్నా ముఖ్యమని.. ఇపుడున్న పరిస్థితుల్లో వారి ఆరోగ్యానికి తాను గ్యారెంటీ ఇవ్వలేనని.. రోడ్ల మీద జనాలే మాస్కులు లేకుండా తిరుగుతున్నారని.. ఇక సెట్స్ లో జాగ్రత్తలు పాటించడం ఇంకా కష్టమని చెప్పుకొచ్చాడట. సినీ కార్మికుల ఉపాధి కోసం షూటింగ్స్ చేయడం మంచిదేనని.. కానీ అది సవ్యంగా జరిగేలా ఎవరు చూస్తారనేదే ప్రశ్న అని సురేష్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది.