ఆ కాంబోలో హ్యాట్రిక్ మూవీ సాధ్యపడేనా…?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘అతడు’ ‘ఖలేజా’ అనే రెండు సినిమాలు వచ్చాయి. వాటిలో ‘అతడు’ సినిమా సక్సెస్ అందుకున్నప్పటికీ ‘ఖలేజా’ నిరాశపరిచింది. అయితే ఈ సినిమాతో మహేష్ లోని కామెడీ యాంగిల్ బయటకి వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు టీవీలో టెలికాస్ట్ అయినా మంచి ఆదరణ తెచ్చుకుంటుంది. అందుకే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో మూవీ వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతోందని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చింది. అయితే ఈ దొరికిన సమయంలో త్రివిక్రమ్ మహేష్ కోసం ఓ స్క్రిప్ట్ డెవెలప్ చేశారట. ఇటీవల మహేష్ కి ఈ స్టోరీ వినిపించాడని.. మహేష్ కూడా పాజిటివ్ గా స్పందించాడని సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. అయితే ఒకవేళ ఇది నిజమే అనుకుంటే ఇప్పట్లో ఈ కాంబినేషన్ సాధ్యపడేనా అనే డౌట్ వస్తుంది.

దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో తన నెక్స్ట్ సినిమా ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ పూర్తవడానికి చాలా సమయమే పట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో మహేష్ – జక్కన్న కాంబో సెట్స్ మీదకు వెళ్ళడానికి టైం పట్టనుందని అర్థం అవుతోంది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ కంప్లీట్ అయితే గానీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో అడుగుపెట్టడు. అంటే ఈ సినిమా స్టార్ట్ అయి.. కంప్లీట్ అవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేము. ఒకవేళ మహేష్ ‘సర్కారు వారి పాట’ త్వరగా పూర్తి చేసి మరో సినిమా చేద్దాం అనుకున్నా.. అక్కడ త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉంటాడు. దీనికి తోడు మహేష్ కోసం మురగదాస్ – ప్రశాంత్ నీల్ – అనిల్ రావిపూడి లైన్లో ఉన్నారని మరో రూమర్ వచ్చింది. ఇక త్రివిక్రమ్ కూడా మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడని మరో న్యూస్ వస్తోంది. వీటన్నిటికి బట్టి చూస్తే మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా సాధ్యపడినా.. అది ఎప్పుడు అనేది చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. మహేష్ – త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.