లంకేయులు వర్సెస్ తమిళుల రచ్చ నేపథ్యంలో సూర్య సాహసం?

0

హీరో సూర్య ప్రయోగాత్మక చిత్రం `ఆకాశం నీ హద్దురా` ఇటీవల ఓటీటీలో రిలీజై విజయం సాధించిన సంగతి తెలిసిందే. సుధా కొంగర తెరకెక్కించిన ఈ మూవీ అనేక సవాళ్లని అధిగమించి చివరికి సూర్యకు తిరుగులేని సక్సెస్ ని అందించింది. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో సూర్యకు తన కెరీరలోనే ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. సాహసోపేతమైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించారన్న ప్రశంసలు దక్కాయి.

ఈ మూవీ తరువాత సూర్య ఎలాంటి చిత్రం చేయబోతున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ తరువాత సూర్య మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. దీని కోసం ఇప్పటికే పల్లెటూరి నేపథ్యంలో ఓ కథని అనుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ వార్తలు నిజం కాదని తెలిసింది.

`ఆకాశం నీ హద్దురా` తరువాత సూర్య కొత్త తరహా సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు హరికి వివరించి శ్రీలంక నేపథ్యంలో సినిమా చేద్దామని ఐడియా కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. సూర్య ఇచ్చిన ఐడియాని హరి స్క్రిప్ట్ గా మలిచే ప్రయత్నాల్లో వున్నారట. శ్రీలంక – తమిళ వర్గాల మధ్య తరాలుగా వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీ తమిళ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆసక్తితో పాటు వివాదాల్లో కూడా చిక్కుకునే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు.