సుశాంత్ : పోలీసులను ఆశ్రయించిన మరో హీరో

0

సుశాంత్ మృతి తర్వాత బాలీవుడ్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వివాదాలు గొడవలు కేసులు చాలా కామన్ అయాయి. సుశాంత్ మృతి కేసుపై నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. ఈ సమయంలో సుశాంత్ కేసుతో పాటు మరికొన్ని కేసులు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎప్పుడో చనిపోయిన జియా ఖాన్ కేసు నుండి మొదలుకుని మొన్న చనిపోయిన దిశా సలియన్ ఆత్మహత్య కేసు వరకు అన్ని కూడా ఇప్పుడు మీడియాలో రచ్చ రచ్చ అవుతున్నాయి.

జాతీయ మీడియా నుండి గల్లీ మీడియా వరకు అనేక మీడియా సంస్థలు ప్రస్తుతం ఆ కేసులన్నింటిని తోడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో జియా ఖాన్ హత్య కేసు నింధితుడు అయిన నటుడు సూరజ్ పంచోలీ పై ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. చాలా కాలం పాటు జియా ఖాన్ కేసులో విచారణ ఎదుర్కొన్న సూరజ్ ఈమద్య దాని నుండి బయట పడ్డాడు. ఇలాంటి సమయంలో సూరజ్ పంచోలీ పేరు దిశా ఆత్మహత్య కేసులో కి జొప్పిస్తూ కథనాలు వస్తున్నాయి.

దిశా మరియు సుశాంత్ కేసుల్లో కూడా సూరజ్ పంచోలీ ఉన్నాడేమో అనుమానాలు వ్యక్తం చేస్తూ కొందరు కథనాలు ప్రసారం చేస్తున్నారు. జాతీయ మీడియాలో వస్తున్న కథనాలతో ఇబ్బంది పడుతున్న సూరజ్ ఇక లాభం లేదనుకుని ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయండి అంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన గురించి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఇప్పటికే రియా చక్రవర్తి మీడియాపై కేసు పెట్టిన విషయం తెల్సిందే. తన పేరును సుశాంత్ మృతి కేసులో ప్రముఖంగా ఇరికించేందుకు మీడియా ప్రయత్నాలు చేస్తుంది అనేది ఆమె ఫిర్యాదు. మొత్తానికి సుశాంత్ మృతి తర్వాత బాలీవుడ్ మొత్తం గందరగోళంగా మారింది.