సుశాంత్ కేసు: వైరల్ అవుతున్న రియా – మహేష్ భట్ వాట్సాప్ ఛాటింగ్

0

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజులు గడిచేకొద్దీ ఈ కేసు విషయంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ మీడియా ఛానళ్ల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మరియు దర్శకనిర్మాత మహేష్ భట్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ బయటకి వచ్చింది. దీనిని బట్టి సుశాంత్ చనిపోవడానికి ఆరు రోజుల ముందు జూన్ 8న రియా వాట్సాప్ ఛాటింగులో తన బాయ్ ఫ్రెండ్ సుశాంత్ ను విడిచిపెట్టినట్లు మహేష్ భట్ కు చెప్పినట్లు తెలుస్తోంది. రియా తండ్రికి సుశాంత్ పై సదభిప్రాయం లేదని.. అందుకే సుశాంత్ ను వదిలేయాలని మహేష్ భట్ రియాకు సలహా ఇచ్చాడని వాట్సాప్ ఛాట్ ద్వారా అర్థం అవుతోంది. ఈ ఛాటింగ్ ‘జలేబీ’ చిత్రంలో రియా చక్రవర్తి పోషిస్తున్న ఆయేషా పాత్ర పేరిట మహేష్ భట్ తో ఛాటింగు చేసినట్లు వెల్లడైంది. ‘జలేబీ’ చిత్రానికి మహేష్ భట్ – ముఖేష్ భట్ ప్రొడ్యూసర్స్ కావడం గమనార్హం.

కాగా ఈ వాట్సాప్ ఛాటింగ్ ప్రకారం ”భారమైన హృదయంతో రిలీఫ్ తో ఆయేషా మూవ్ ఆన్ అయింది.. మన చివరి కాల్ వేక్ అప్ కాల్” అని రియా తన సందేశంలో పేర్కొన్నారు. దీనికి మహేష్ భట్ ”వెనక్కి తిరిగి చూడవద్దు.. మై లవ్ టూ యువర్ ఫాదర్.. మీ తండ్రి సంతోషపడతాడు” అని రియాకు సమాధానం ఇచ్చాడు. దీనికి రియా ”నాకు కొంత ధైర్యం లభించింది. మీరు నాన్న గురించి ఫోనులో చెప్పిన రోజు నేను స్ట్రాంగ్ గా ఉన్నాను.. మీకు ఎల్లప్పుడు ధన్యవాదాలు” అంటూ భట్ కు చెప్పింది. దానికి ‘నీవు నా కూతురు లాంటిదానివి’ అని మహేష్ భట్ రిప్లై ఇచ్చారు. ”మాటల్లేవు సర్.. హార్ట్ ఫుల్ గా నేను మీ పట్ల ఫీల్ అవుతున్న బెస్ట్ ఎమోషన్స్.. నన్ను మిమ్మల్ని కలిసేలా చేసిన విధికి ధన్యవాదాలు” అని మెసేజ్ పెట్టింది రియా. అంతేకాకుండా రియా బర్త్ డే నాడు మహేష్ భట్ విషెస్ చెప్పగా.. ‘మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను’ అని రియా చెప్పినట్లు వెల్లడైంది. దీనికి మహేష్ భట్..” నువ్ ఆల్రెడీ గర్వపడేలా చేసావ్. డోంట్ లుక్ బ్యాక్” అని సమాధానం ఇచ్చాడు. రియా – మహేష్ భట్ మధ్య జరిగిన వాట్పాప్ ఛాటింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.