తారక్ వెనుక క్యూ 2023 వరకు ఉంది

0

ట్యాలెంటెడ్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని భావించాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కాని కరోనా వల్ల ఆయన ప్లాన్స్ అన్ని కూడా తలకిందులు అయ్యాయి. ఇప్పటికే త్రివిక్రమ్ మూవీ ప్రారంభం అయ్యి షూటింగ్ ముగింపు దశకు చేరుకోవాల్సి ఉంది. కాని ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా ఎన్టీఆర్ పూర్తి చేయలేక పోయాడు. దాంతో త్రివిక్రమ్ మూవీ వచ్చే ఏడాదిలో ఆరంభం అయ్యే అవకాశం ఉంది.

త్రివిక్రమ్ మూవీ కంటే ముందు నుండే తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాను ఎన్టీఆర్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికి కూడా ఆ సినిమా విషయమై చర్చలు జరుగుతున్నాయి. అట్లీ కూడా ఎన్టీఆర్ తో ఒక యాక్షన్ సినిమాను చేయాలనే కోరిక ఉంది అంటూ చెప్పకనే చెప్పాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు వీరిద్దరి కాంబోను సెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ముగ్గురు దర్శకులు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ లిస్ట్ లో మరో దర్శకుడు వచ్చి చేరాడు. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్వకత్వంలో కూడా ఒక సినిమాను చేసేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడట. మహా నటి తర్వాత గ్యాప్ తీసుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ త్వరలోనే ప్రభాస్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అదే ఏడాది లేదా 2023లో ఎన్టీఆర్ మరియు నాగ్ అశ్విన్ ల కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని వైజయంతి మూవీస్ వర్గాల వారు అంటున్నారు. ప్రభాస్ మూవీ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ తో మూవీ విషయమై నాగ్ అశ్విన్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.