నువ్వు జక్కన్నతో డీల్ చేస్తున్నావ్.. జాగ్రత్త!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఇప్పటికే చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో ఎన్టీఆర్ గిఫ్ట్ అందించాడు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో చరణ్ పాత్రని ఎలివేట్ చేస్తూ సాగిన ఆ వీడియో సినీ అభిమానులకి మంచి అనుభూతిని కలిగించింది. అలానే ఎన్టీఆర్ బర్త్ డే కి చరణ్ ‘రామరాజు ఫర్ భీమ్’ గిఫ్ట్ గా ఇస్తాడని భావించినప్పటికీ కరోనా కారణంగా కుదరలేదు. అయితే ఇటీవలే అక్టోబర్ 22న ఉదయం 11 గంటలకు ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు ఈ స్పెషల్ వీడియో రానున్న నేపథ్యంలో చరణ్ ట్విట్టర్ వేదికగా ‘రామరాజు ఫర్ భీమ్’ నుంచి చిన్న వీడియో క్లిప్పింగ్ షేర్ చేశాడు.

రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ ”బ్రదర్ తారక్.. నిన్ను టీజ్ చేయడానికి ఇక్కడ ఏదో ఉంది.. మీలా కాకుండా నేను సమయానికి వచ్చేలా చూస్తాను” అని పేర్కొన్నాడు. దీనికి తారక్ స్పందిస్తూ.. ”చరణ్ బ్రో.. మీరు ఇప్పటికే 5 నెలలు ఆలస్యం చేసారని మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను.. నువ్వు జక్కన్నతో డీల్ చేస్తున్నావ్ జాగ్రత్త.. ఏమైనా జరగవచ్చు!! ఏదేమైనా వేచి ఉండలేకపోతున్నాను.. ఫుల్ ఎక్సయిట్ గా ఉంది” అని ట్వీట్ చేసాడు. చరణ్ దీనికి కొనసాగింపుగా ”నన్ను నమ్ము.. ఇది ఆలస్యం అయినందుకు విలువైనదిగా ఉండబోతోంది.. రేపు ఉందయం 11 గంటలకు” అని రిప్లై ఇచ్చాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ కూడా ‘రేపు సింహం వచ్చేస్తోంది’ అని అంటూ ‘రామరాజు ఫర్ భీమ్’ పై అంచనాలు పెంచేశారు. తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియోకి చరణ్ డబ్బింగ్ చెప్తున్నారు. మొత్తం మీద ‘కొమరం భీమ్’కి బాకీ పడిన ‘అల్లూరి సీతారామరాజు’ రిటర్న్ గిఫ్ట్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.