కంగన మనాలి ఇంటికి సమీపంలో వైల్డ్ డాగ్

0

ఇటీవల గత కొంతకాలంగా క్వీన్ కంగన హడావుడి తెలిసినదే. ముంబై టు మనాలి కంగన ఎపిసోడ్స్ హీటెక్కించాయి. కంగనకు మనాలిలో పర్వతసానువుల నడుమ ఒక సుందరమైన స్వగృహం కొలువు దీరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అటు చైనా బార్డర్ లో ప్రత్యర్థి సైనికుల కవాతు గురించి దేశమంతా ఆసక్తికర చర్చ సాగిస్తుంటే.. ఏ సమయంలో యుద్ధం వస్తుందోనన్న ఆందోళన నెలకొన్న వేళ .. మనాలి లోనే కంగన నివశిస్తోంది. ఇక మనాలి నుంచి ప్యాంగ్ యాంగ్ లేక్ వరకూ షూటింగుల కోసం మన దర్శకనిర్మాతలు ఉవ్విళ్లూరుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తాజాగా అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్` షూటింగ్ కూడా మనాలిలోనే చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాణమవుతోన్న 6వ చిత్రం. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ మనాలీలోని సుందర ప్రదేశాల్లో మొదలైంది. సుదీర్ఘంగా కొనసాగే ఈ షెడ్యూల్లో నాగార్జునతో సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున ఇప్పటివరకూ చేయని విభిన్న తరహా పాత్రను చేస్తున్నారు. క్రిమినల్స్ ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వల్ల సినిమాలో ఆయనను వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. ఈ చిత్రంలో నాగార్జున జోడీగా దియా మీర్జా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ కీలక పాత్రలో సయామీ ఖేర్ కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కుమార్ సంభాషణలు రాస్తుండగా షానీల్ డియో సినిమాటోగ్రాఫీ అందిస్తుస్తున్నారు. అన్నట్టు కంగన ఇంటి పరిసరాల్లోనే షూటింగ్ చేస్తున్నారు కాబట్టి ఓసారి అటెళ్లి కలిసొస్తారా వైల్డ్ డాగ్ టీమ్? కంగన స్వయంగా నాగార్జున టీమ్ ని డిన్నర్ కి ఇన్వయిట్ చేస్తుందేమో చూడాలి.