బాబాయ్ బాలయ్య సినిమాలో అబ్బాయ్…?

0

నటసింహ నందమూరి బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ అన్నీ తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ కూడా తిరిగి స్టార్ట్ అయింది. ఇదిలా ఉండగా BB3 మూవీ నుంచి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న ఈ మూవీలో మరో నందమూరి హీరో తారకరత్న నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఓ రాజకీయ నాయకుడి పాత్రలో తారకరత్న కనిపించనున్నారట. ఇదే కనుక నిజమైతే బాబాయ్ బాలయ్య సినిమాలో అబ్బాయ్ తారకరత్న నటించడం ఇదే తొలిసారి అవుతుంది. ఇంతకముందు నందమూరి కళ్యాణ్ రామ్ బాబాయితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘సారథి’ అనే సినిమా చేస్తున్న తారకరత్న.. BB3 మూవీలో నటిస్తున్నాడో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

కాగా బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఫస్ట్ రోర్’ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమాలు ‘సింహా’ ‘లెజెండ్’ తరహాలోనే తనదైన యాక్షన్ పంథాలో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. మరి బిబి3 మూవీతో బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.