‘ది చేజ్’ ఫస్ట్ లుక్…!

0

సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కార్తీక్ రాజ్. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ లో ‘కన్నాడి’ పేరుతో విడుదలై విశేష ఆదరణ పొందింది. ఈ క్రమంలో హీరోయిన్ రెజీనా కాసాండ్ర ప్రధాన పాత్రలో ‘నేనే నా…?'(సూర్పనాగై) అనే ద్విభాషా సినిమా తెరకెక్కించాడు కార్తీక్. ఈ సినిమా విడుదలవక ముందే కార్తీక్ రాజ్ ”ది చేజ్” అనే వైవిధ్యభరితమైన సినిమాతో రాబోతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

కాగా ‘చేజ్’ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు తమిళ్ మలయాళ హిందీ కన్నడ భాషల్లో రూపొందనుంది. ‘ప్యార్ ప్రేమ కాదల్’ సినిమాతో హిట్ కొట్టి సూపర్ ఫార్మ్ లో ఉన్న హీరోయిన్ రైజా విల్సన్ ”చేజ్” మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. బుల్లితెర యాంకర్ అనసూయ ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి – నీల్ నితిన్ ముఖేష్ – జయసూర్య – రెజీనా కాసాండ్రా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

ఇక ”ది చేజ్” ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరోయిన్ రైజా విల్సన్ ఒంటి నిండా గాయాలతో కాళ్ళు కట్టేసి తలక్రిందులుగా వేలాడదీయబడి ఉంది. టైటిల్ లోగో కూడా రక్తం తో తడిసిపోయినట్లు డిజైన్ చేయబడి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని ఆపిల్ స్టూడియోస్ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా ఆర్. వేల్ రాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా వివిధ భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.