‘ఆచార్య’ కోసం ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్..!


మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ”ఆచార్య”. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కాజల్ కిచ్లు హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కొరటాల శివ ఈ చిత్రాన్ని తనదైన శైలిలో సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు జోడించి రూపొందిస్తున్నాడని తెలుస్తోంది. కోవిడ్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. దేవాదయ భూములు మరియు నక్సలిజం నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన సెట్స్ నిర్మాణం చేపట్టారు.

తాజాగా చిరంజీవి ‘ఆచార్య’ కోసం సెట్స్ గురించి ట్విట్టర్ వేదికగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ”ఆచార్య కోసం ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్ 20 ఎకరాల విస్తీర్ణంలో సెట్ వేయడం జరిగిందని.. అందులో భాగంగా గాలి గోపురంను ఆశ్చర్యం గోలిపేలా అద్భుతంగా మలిచారు. ఇది ఎంతో ముచ్చటగా అనిపించి నా కెమెరాలో బంధించి మీతో పంచుకుంటున్నాను. నిజంగా టెంపుల్ టౌన్ లో ఉన్నామా అనుకునేలా రూపొందించిన కళా దర్శకుడు సురేష్ ని విజువలైజ్ చేసిన దర్శకుడు కొరటాల శివని.. వనరులు అందించిన నిర్మాతలను అభినందిస్తున్నాను. ప్రేక్షకులకు కూడా ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది” అని చిరు వీడియో ద్వారా చెప్పుకొచ్చారు. కాగా ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.