Templates by BIGtheme NET
Home >> Cinema News >> సోనూ విద్యాదానం.. వంద స్మార్ట్ ఫోన్లు అందజేత!

సోనూ విద్యాదానం.. వంద స్మార్ట్ ఫోన్లు అందజేత!


ఆదుకోవాలనే మనసుండాలే కానీ.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆపన్నహస్తం అందించొచ్చు అని మరోసారి చాటిచెప్పాడు సినీనటుడు సోనూ సూద్. కరోనా కష్టకాలంలో వేలాది మంది కార్మికులు అభాగ్యులకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించాడు సోనూ.

లాక్ డౌన్లో ఏ దిక్కూమొక్కూ లేక అవస్థలు పడుతున్న ఎంతో మందిని వారి సొంత ప్రాంతాలకు చేర్చి ఆపద్భాందవుడు అయ్యాడు. ఈ క్రమంలో తన ఇంటిని కూడా తాకట్టు పెట్టి అన్నార్తులకు సహాయం అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు. అయితే.. లాక్ డౌన్ ముగిసిన తర్వాత కూడా ఆయన ధాతృత్వం కొనసాగుతోంది.

తాజాగా.. మరోసారి వంద మంది సినీ కార్మికులకు సాయం అందించాడు సోనూ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాలో సోనూసూద్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో నడుస్తోంది. కాగా.. ఈ షూటింగ్ లో పనిచేసే సినీకార్మికులకు సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు సోనూ.

ఇక్కడ పనిచేసే వందమంది కార్మికులు కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అలాగే.. తమ పిల్లలు ఆన్ లైన్ క్లాసుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్.. ఆ వంద మంది కార్మికులకు మొబైల్ ఫోన్స్ ను బహుమతిగా అందజేశారు.

అయితే.. ఈ విషయాన్ని కార్మికులకు ముందస్తుగా తెలపలేదు సోనూ. ఉన్నట్టుండి స్మార్ట్ ఫోన్స్ అందజేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయ్యారు. సోనూ గిఫ్ట్ అందుకున్న కార్మికుల ఆనందానికి అవధులు లేవు. సోనూ సాయాన్ని మరవలేమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.