ఆ గ్రామం మొత్తం సోనూ సూద్ కు రుణ పడింది

0

సోనూసూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. లాక్ డౌన్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఏడాది కాలంలో ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాడు. సాయం కోరిన వారికి తనవంతు సాయం అందిస్తూ ఉన్న సోనూసూద్ ఒక గ్రామం మొత్తంకు సాయం చేశాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామం నీటి కోసం అవస్థలు పడుతున్న విషయం ను జితేంద్ర అనే వ్యక్తి సోనూసూద్ దృష్టికి తీసుకు వచ్చాడు. అక్కడి వారు మంచి నీటి కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తున్న నేపథ్యంలో సోనూసూద్ ఆ గ్రామం వారి కోసం మంచి నీరు అందించేందుకు తన ఫౌండేషన్ తరపున ముందుకు వచ్చాడు. సూద్ ఫౌండేషన్ ప్రతినిధులు గ్రామంలో పరిస్థితిని మరోసారి సమీక్షించి విషయాన్ని తెలుసుకున్నారు.

గ్రామ ప్రజలకు నీటి అవసరం చాలా ఉందని కనీసం మంచి నీరు లేక వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించి చలించి పోయిన సోనూ సూద్ వెంటనే తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడ బోర్లు వేయించాడు. బోర్లు వేయించడంతో పాటు చేతి పంపులను కూడా ఏర్పాటు చేసి నీటి అవసరాలను తీర్చాడు. బోరు వేస్తున్న సమయంలో ఆ గ్రామ ప్రజలు ఆసక్తిగా చూడటం తన మనసును హత్తుకుంది అంటూ సోనూసూద్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఎన్నో ఏళ్లుగా పడుతున్న ఇబ్బందిని సోనూ సూద్ తీర్చడంతో గ్రామస్తులు అంతా కూడా ఆయనకు రుణ పడి ఉన్నామని అంటున్నారు. మరోసారి సోనూ సూద్ మంచి మనసుకు ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా నీరాజనాలు పలికారు.