పవన్ కోటి ప్రభాస్ కోటిన్నర విరాళం!

0

హైదరాబాద్ ను ముంచెత్తిన వాన చాలామందిని నిరాశ్రయులైన చేసింది. ఈ వరదల విపత్తుతోపాటు కరోనా కారణంగా అందరి ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం కేసీఆర్ పిలుపునకు అద్భుతమైన స్పందన వస్తోంది.సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ఇప్పటికే నిన్న విరాళాలు ప్రకటించారు.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు కష్టాల్లో ఉండే ప్రతిసారి స్పందించే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ తాజాగా కూడా స్పందించింది. నిన్న చిరంజీవి నాగార్జున మహేష్ ఎన్టీఆర్ తదితర హీరోలు దర్శకులు తెలంగాణ ప్రభుత్వానికి విరాళాలు ప్రకటించారు.

తాజాగా మరో ఇద్దరు నటులు కూడా భారీ సాయం ప్రకటించారు. అగ్రహీరో రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వరద బాధితుల కోసం తన వంతుగా రూ .1 కోటి విరాళం ప్రకటించారు. పవన్కళ్యాణ్ ఈ మొత్తాన్ని తెలంగాణ సీఎం సహాయ నిధికి అందజేస్తున్నట్టు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక జనసైనికులు జనసేన నాయకులు కూడా సహాయ కార్యక్రమాలు విరాళాల్లో పాలుపంచుకోవాలని బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

పవన్ విడుదల చేసిన వీడియోలో సునిశిత విమర్శలు కూడా చేశారు. హైదరాబాద్ లో దశాబ్దాలుగా పట్టణ ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ వరదలు వచ్చాయని.. పునరుద్దరణ చేయలేనంతగా హైదరాబాద్ లో పరిస్థితి తయారైందని విమర్శించారు. ఈ విపత్తుకు కారణాలను అన్వేషించకుండా ఈ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వంకు అందజేస్తున్నానని సహాయక చర్యలు కొనసాగించాలని సూచించారు.

*ప్రభాస్ కోటిన్నర విరాళం
భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న హైదరాబాదీలకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. దేశీయ లెవల్లో స్టార్ హీరో అయిపోయిన మన ప్రభాస్ విరాళాల్లోనూ అందరు తెలుగు హీరోలకంటే ఎక్కువే సాయం ప్రకటించడం విశేషం.

తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ వరద బాధితుల కోసం తన వంతు సాయం ప్రకటించాడు. తెలంగాణ సీఎం సహాయనిధికి కోటిన్నర రూపాయల విరాళం ప్రకటించి తనపెద్ద మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ లో భాగంగా ఇటలీలో ఉన్న సంగతి తెలిసిందే