లాక్ డౌన్ లో లుక్ మార్చేసిన టాలీవుడ్ హీరోలు…!

0

సినిమాల్లో కథానాయకులు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తేనే సినీ ప్రేక్షకులు కూడా అదే తరహాలో ఆదరిస్తూ ఉంటారు. అందుకే హీరోలు సినిమాతో పాటు తమ లుక్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తమ సినిమాలో ప్రేక్షకులకు కనువిందుగా కనిపించడానికి శక్తిమేర కృషి చేస్తుంటారు. ముఖ్యంగా మన తెలుగు హీరోలు లుక్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంటారు. ఎప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే హీరోలు కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ వచ్చారు. దీంతో చాలామంది హీరోల బాడీ షేప్ లో మార్పులు కనిపించాయి. సినిమాలు లేవు కదా అని అనుకున్నారేమో కొంచం బొద్దుగా తయారయ్యారు. అయితే మరికొందరు హీరోలు మాత్రం లాక్ డౌన్ లో కావాల్సినంత సమయం దొరికిందంటూ తమ బాడీ షేప్ ని హెయిర్ స్టైల్ ని.. లుక్ ని మార్చేసి అదరగొడుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఆరు చిత్రాల నుండి లుక్ పరంగా పెద్దగా వేరియేషన్ చూపించలేదేనే చెప్పాలి. అందుకని త్వరలో స్టార్ట్ కాబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం లుక్ ని మార్చేశారు మహేష్. ఇటీవల ఓ యాడ్ షూట్ కోసం బయటకు వచ్చిన మహేష్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పొడవాటి జుట్టుతో లైట్ గా గడ్డం పెంచి కనిపిస్తున్న మహేష్ లుక్ అభిమానులకు కిక్ ఇచ్చింది. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన లుక్ లో లైట్ గా వేరియేషన్ చూపించాడు. ఇటీవల హరితహారంలో భాగంగా బయటకు వచ్చిన ప్రభాస్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. అక్కినేని అఖిల్ లాక్ డౌన్ లో కఠోర వర్కౌట్స్ చేసి తన బాడీని బిల్డ్ చేశాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో త్వరలో స్టార్ట్ కాబోతున్న సినిమా కోసం అఖిల్ తన లుక్ మార్చేసాడని తెలుస్తోంది.

సీనియర్ హీరోలైన చిరంజీవి – నాగార్జున సైతం సరికొత్త లుక్ లో దర్శనమిచ్చారు. మేకప్ అయినప్పటికే మెగాస్టార్ చిరంజీవి గుండు లుక్ అందరిని ఆకట్టుకుంది. ఇక కింగ్ నాగార్జున ‘బిగ్ బాస్’ కోసం మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడంతో పాటు ‘వైల్డ్ డాగ్’ సినిమా కోసం లుక్ చేంజ్ చేశాడు. ఈ సినిమాలో మిడిల్ ఏజ్ పాత్రలో కనిపించనున్న నాగ్ దీని కోసం వైట్ హెయిర్ తో కనిపించనున్నాడు. యువ హీరో నాగశౌర్య తాజా లుక్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. లాక్ డౌన్ లో భారీ వర్కౌట్స్ చేసిన శౌర్య.. త్వరలో స్టార్ట్ కాబోయే స్పోర్ట్స్ డ్రామా కోసం సిక్స్ ప్యాక్ మైంటైన్ చేస్తూ వస్తునాడు. ‘వి’ సినిమాలో కండలు తిరిగిన దేహంతో పోలీసుగా అబ్బురపరిచిన సుధీర్ బాబు.. ఇప్పుడు బాడీతో పాటు హెయిర్ కూడా పెంచేసి కొత్తగా కనిపిస్తున్నాడు.

అంతేకాకుండా అల్లు అర్జున్ తాజా ఫోటోలు చూస్తే కూడా మళ్ళీ ‘పుష్ప’ గెటప్ లోకి వచ్చేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఇక లాక్ డౌన్ ప్రారభంలో కాస్త బొద్దుగా కనిపించిన వరుణ్ తేజ్ – సాయి ధరమ్ తేజ్ లు మళ్ళీ వర్కౌట్స్ స్టార్ట్ చేసి లుక్ మార్చేశారు. యువ హీరో సందీప్ కిషన్ తాను నటించబోయే సినిమా కోసం భారీ వర్కౌట్స్ చేసి ఆరు పలకల దేహాన్ని రెడీ చేశాడు. బాడీలోనే కాకుండా హెయిర్ స్టైల్ లో కూడా వేరియేషన్ చూపిస్తున్నాడు సందీప్. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పొడవాటి జుట్టుతో పాటు గడ్డం పెంచేసి కొత్త లుక్ లో కనిపించాడు. యువ హీరోలు నిఖిల్ – అడవి శేష్ – మంచు మనోజ్ కూడా కొత్త అవతారాల్లో అభిమానులను అలరిస్తున్నారు.