మహమ్మారి కారణంగా త్రివిక్రమ్ గుట్టు రట్టయ్యిందా…?

0

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రచయితగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన త్రివిక్రమ్ ‘నువ్వే నువ్వే’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ‘అతడు’ ‘అత్తారింటికి దారేది’ ‘జల్సా’ ‘జులాయి’ ‘అ ఆ’ ‘అరవింద్ సమేత వీర రాఘవ’ ‘అల వైకుంఠపురములో’ వంటి విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అయితే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న త్రివిక్రమ్ పై ఒక అపవాదు ఉంది. ఈయన హాలీవుడ్ సినిమాల నుండి స్టోరీలను సీన్స్ కాపీ చేస్తుంటాడని సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. ఇండస్ట్రీలోని చాలామంది దర్శకులు తమ సినిమాల విషయంలో స్టోరీ లైన్ లేదా కొన్ని ఎపిసోడ్స్ వంటివి ఎక్కడో ఒకచోట ప్రేరణలు పొందుతుంటారు. అయితే ఈ విషయంలో మిగతా దర్శకుల కంటే త్రివిక్రమ్ వైపే అందరూ వేలెత్తి చూపిస్తుంటారు. దీనికి కారణం త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాకు లేదా సినిమాలోని సీన్స్ కి ఏదో ఒక సినిమా అనుకరణ ఉండటమే అని తెలుస్తోంది.

కాగా కరోనా నేపథ్యంలో కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో అందరూ టైంపాస్ కోసం ఆ సినిమా ఈ సినిమా.. ఆ భాష ఈ భాష అంటూ తేడా లేకుండా ప్రతి సినిమా చూసేస్తున్నారు. అయితే కొన్ని పాత సినిమాలను.. ఇతర లాంగ్వేజ్ సినిమాలను చూసి ఆ సినిమాలోని పలానా సీన్ పాత సినిమాకు కాపీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ సినిమాల దర్శకులను టార్గెట్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమాలోని కాపీ సీన్స్ అన్నిటిని బయటకి తీశారు. దీనికి ‘త్రివిక్రమైజేషన్’ అని పేరు పెట్టి కాపీ సీన్స్ తో వీడియోలు చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హాలీవుడ్ మూవీ సీన్స్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలోని ఆడియోని జత చేసారు. ‘నువ్వే నువ్వే’ సినిమాలోని సునీల్ – ఎమ్మెస్ నారాయణ మధ్య వచ్చే కామెడీ సీన్.. ‘మల్లీశ్వరి’లో వెంకటేష్ ప్యాంటుని పెట్ డాగ్ లాగే సీన్.. ‘అతడు’ సినిమాలో హీరో ఎస్కేప్ సీన్ – ‘అత్తారింటికి దారేది’లో ఆకులు రాలే సీన్ మరియు సమంత కార్ లో డ్రెస్ చేంజ్ చేసుకునే సీన్.. ‘నువ్వు నాకు నచ్చావ్’ లో ప్రకాష్ రాజ్ కవిత చదివే సీన్.. లతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రెస్ మీట్ లో నేను ఏ హాలీవుడ్ సినిమాలో సీన్స్ కాపీ చేయను.. అవి నా ఆలోచనలు అని కచ్చితంగా చెప్పగలను అని చెప్పే క్లిప్పింగ్ యాడ్ చేశారు.

అంతేకాకుండా ‘అతడు’ క్లైమాక్స్ ఫైట్.. ‘జల్సా’లో పవన్ – ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సీన్.. ‘ఖలేజా’ సినిమాలో ఇరీడియమ్ టెస్టింగ్ సీన్.. ‘అరవింద సమేత’లో మొండి కత్తి సీన్.. ‘జులాయి’ సినిమాలో బ్యాంకు రాబరీ సీన్ అండ్ విలన్ కార్ చేజింగ్ సీన్.. లతో యూట్యూబ్ లో అనేక వీడియోలు అప్లోడ్ చేశారు. ఈ క్రమంలో ‘అ ఆ’ యద్దనపూడి ‘మీనా’ కథకు ఇన్స్పిరేషన్ అని.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అని.. ‘అజ్ఞాతవాసి’ ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్’ కాపీ అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. నిజానికి ‘లార్గో వించ్’ డైరెక్టర్ నా సినిమాని కాపీ చేసారని.. లీగల్ గా ప్రొసీడ్ అవుతానని చెప్పడంతో అప్పట్లో త్రివిక్రమ్ పై పెద్ద చర్చే జరిగింది. అంతేకాకుండా ‘అల వైకుంఠపురములో’ మూవీ కూడా సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఇంటి గుట్టు’ సినిమాని పోలి ఉంటుందని.. మొత్తం మీద ఈ మహమ్మారి కారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గుట్టు బయటపడిందని యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.