సోనూసూద్ తో కంపేర్ చేస్తూ మెగాస్టార్ పై ట్రోల్స్…!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా మాద్యమాలలో కొద్దిగా లేట్ గా ఎంట్రీ ఇచ్చినా.. రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ అభిమానులను సంతోషపెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులపై స్పందించడమే కాకుండా.. తన జ్ఞాపకాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సీసీసీ కి సంభందించిన వివరాలు వెల్లడించడం.. విపత్కర పరిస్థితుల్లో తన సందేశాలతో ప్రజల్లో చైతన్యం కల్పించడం.. ప్రముఖుల బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పడం.. ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే విషయాలు వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మొన్న ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు’ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అదేరోజు విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరగడంతో మరుసటి రోజు ‘అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట’ అంటూ చిరు చేపల గుజ్జు ఏపుడు చేసి తల్లికి తినిపించే వీడియో పోస్ట్ చేసారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్స్ ట్రోలింగ్ చేసారు.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కుంటున్న సమయంలో ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు’ అంటూ చిరంజీవి ట్వీట్స్ చేయడంతో నెటిజన్స్ ఆయనపై నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. కరోనా సమయంలో కష్టమొచ్చినోళ్లను ఆదుకుంటున్న రియల్ హీరో సోనూసూద్ తో కంపేర్ చేసి చిరు ప్రయత్నాన్ని ఎత్తిపొడుస్తూ విమర్శలు చేసారు. ఇలాంటి విపత్కర సమయంలో సోనూసూద్ లా ఏదైనా పనికొచ్చే విషయాలకు సోషల్ మీడియా వాడుకోకుండా.. ఇలాంటి పోస్టులు పెట్టడం మెగాస్టార్ స్థాయి కాదని.. రీల్ లైఫ్ హీరో సోనూసూద్ ని చూసైనా నేర్చుకోవాలని కామెంట్స్ చేసారు. మెగాస్టార్ ఏదో అనుకోని తన తల్లికి ఆప్యాయంగా వంట చేసి పెట్టి వీడియో పోస్ట్ చేస్తే.. నెటిజన్స్ మాత్రం దాన్ని మరోలా తీసుకున్నారు.

వాస్తవానికి కరోనా సమయంలో చిరంజీవి సినీ కార్మికులను ఆదుకోడానికి ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ని ఏర్పాటు చేసి వారికి అండగా ఉన్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తనకు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు కరోనా పై అవగాహన కలిగిస్తూ వచ్చారు. కరోనా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేయడంతో పాటు కరోనా పేషెంట్స్ కోసం ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇక సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని.. జాగ్రత్తలు తీసుకొని షూటింగ్స్ స్టార్ట్ చేసుకుంటారని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి అనుమతులు వచ్చేలా కృషి చేసారు. సోనూసూద్ స్థాయిలో కాకపోయినా చిరు కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో తనవంతు సాయం చేస్తూనే ఉన్నారు. అయితే సోనూసూద్ సాయం చేయడంలో తనకెవ్వరూ సాటిలేరు అని రియల్ హీరో అనిపించుకుంటూ దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతున్న నేపథ్యంలో మిగతా వారు చేస్తున్న సాయం ఆయన ముందు కనిపించకుండా పోయిందని చెప్పవచ్చు.