యదార్థ సంఘటనల ‘వి’

0

నాని.. సుధీర్ బాబులు నటించిన ‘వి’ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నాని 25వ సినిమా అవ్వడంతో పాటు సినిమాలో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడంతో జనాల్లో ఆసక్తి నెలకొంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కథ గురించి చాలా రోజులుగా చాలా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ‘వి’ సినిమాలో అదితి రావు హైదరి మృతికి నాని పగ తీర్చుకుంటూ పలువురిని చంపేస్తూ ఉంటాడు. ఆ హత్యల కేసును పోలీస్ ఆఫీసర్ అయిన సుదీర్ బాబు ఎంక్వౌరీ చేస్తూ ఉంటాడు అంటున్నారు.

విడుదల దగ్గర పడ్డ సమయంలో మరింత ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో సంచనంగా నిలిచిన అయేషా మీరా కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందించారంటున్నారు. అయేషా మీరా మృతి విషయంలో పలువురు ప్రముఖులు ఉన్నారంటూ ఆరోపణలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు ఆ కేసు విషయంలో ఏ క్లారిటీ లేదు. ఆ కేసుకు సంబంధించిన కొన్ని సంఘటనలు తీసుకుని వాటితో సినిమాను రూపొందించినట్లుగా తెలుస్తోంది.

దర్శకుడు ఇంద్రగంటి గతంలో ఇలాంటి నేపథ్యంలో సినిమా చేయలేదు. అయినా కూడా ఈ కథను అద్బుతంగా ఆయన మలిచినట్లుగా ట్రైలర్ చూస్తుంటేనే అనిపిస్తుంది. తప్పకుండా ఇదో మంచి సినిమాగా నిలుస్తుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అయేషా మీరా కేసులో డెప్త్ గా వెళ్లకుండా కొన్ని సంఘటనలు మాత్రమే తీసుకుని ఈ సినిమా కథ అల్లినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఓటీటీ లో నేరుగా విడుదల కాబోతున్న మొదటి పెద్ద సినిమా ఇదే అవ్వడంతో ఇండస్ట్రీ మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.