నెమ్మదిగా లైన్ లో పడుతున్న విజయ్ హీరోయిన్..!

0

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’ సినిమాతో తళుక్కున మెరిసింది యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్. షార్ట్ ఫిలిమ్స్ – మోడలింగ్ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించిన ఈ భామ ముందుగా ‘కల వరం ఆయే’ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవడంతో ప్రియాంక ఎవరికీ పరిచయం లేకుండా పోయింది. ఆ తర్వాత వచ్చిన ‘టాక్సీవాలా’ సినిమా సక్సెస్ అవడంతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకుంది. ప్రియాంక జవాల్కర్ తెలుగు నేపథ్యం ఉన్న హీరోయిన్. అందులోనూ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ‘టాక్సీవాలా’ చిత్రం విజయం హిట్ అవడం.. యువతని ఆకర్షించే అందం కూడా జవాల్కర్ కి ఉండటంతో ఆమె టాలీవుడ్ లో దూసుకుపోతుందని అంతా భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రియాంక కు అవకాశాలు రాలేదు. అయితే ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ మళ్ళీ లైన్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రియాంక జవాల్కర్.

‘టాక్సీవాలా’ తరువాత మరో అవకాశం కోసం చాలా రోజులు వెయిట్ చేసిన ఈ బ్యూటీకి ”ఎస్.ఆర్.కళ్యాణమండపం” అనే సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు వీడియో సాంగ్ లో ప్రియాంక జవాల్కర్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో సుజనా రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”గమనం” అనే పాన్ ఇండియా మూవీలో ప్రియాంక నటిస్తోంది. శ్రీయా – నిత్యా మీనన్ – శివ కందుకూరి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో జారా అనే ముస్లిం యువతి పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు తాజాగా జవాల్కర్ ‘తిమ్మరుసు’ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ కోనేరు – సృజన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా ఆఫర్స్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రియాంక జవాల్కర్ ఇలా మూడు సినిమాలతో బిజీగా మారిపోయిందని చెప్పవచ్చు.