Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘నా ఓటు గంగవ్వ’కే ట్రెండింగ్

‘నా ఓటు గంగవ్వ’కే ట్రెండింగ్


తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల ఎదురు చూపులకు తెర పడింది. ఎంటర్టైన్మెంట్కా బాప్ బిగ్ బాస్ సీజన్ 4 మొదలైంది. అద్బుతమైన సెట్ తో పాటు సరికొత్తగా బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో చాలా పుకార్లు వచ్చాయి. అందులో కొన్ని నిజం కాగా మరికొన్ని మాత్రం పుకార్లే అని తేలిపోయింది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో అడుగు పెట్టారు. వారిలో చివరి కంటెస్టెంట్ గా గంగవ్వ కూడా ఉంది.

ఒక సాదారణ పల్లెటూరుకు చెందిన గంగవ్వను సరదాగా శ్రీకాంత్ అనే యూట్యూబర్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆమె కెమెరా ముందు కనబర్చిన ఎనర్జీ అందరికి నచ్చింది. అలా మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ఫేమస్ అయ్యింది. గంగవ్వ అంతకు మించి అయ్యింది. పదుల సంఖ్యలో జాతీయ మీడియా సంస్థలు గంగవ్వపై ప్రత్యేక కార్యక్రమాలు ఇంటర్వ్యూలు చేశాయి. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ లో ఈమె ఎంట్రీ ఇచ్చింది. గంగవ్వ ఎంట్రీ గురించి నెల రోజులుగా ప్రచారం అయితే జరుగుతుంది కాని ఆమె ఉంటుందా లేదా అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేశారు.
అనుమానాలు పటాపంచలు చేస్తూ కాస్త భయం భయంగా గంగవ్వ హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది.

గంగవ్వ బిగ్ బాస్ లో ఉంది అనగానే సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆ పేరు మారు మ్రోగి పోయింది. ట్విట్టర్ లో గంగవ్వ పేరు ట్రెండ్డింగ్ అయ్యింది. 15 మంది ఇంటి సభ్యుల కంటే కూడా గంగవ్వకు అత్యధిక స్పందన వచ్చింది. ఒక్కో కంటెస్టెంట్ ను పరిచయం చేస్తూ నాగార్జున ఇంట్లోకి పంపించిన సమయంలోనే స్టార్ మా కంటెస్టెంట్స్ ఫొటోలను ఫేస్ బుక్ ఇతర సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు. ఫేస్ బుక్ లో కంటెస్టెంట్స్ అందరికి వెయ్యి రెండు వేలు మూడువేల వరకు లైక్స్ వస్తే గంగవ్వ ఉండబోతుందని పోస్ట్ చేసిన వెంటనే ఏకంగా 15 వేల లైక్స్ వచ్చాయి. అంటే గంగవ్వకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

ట్విట్టర్ లో కూడా గంగవ్వ అనౌన్స్ మెంట్ కు భారీ స్పందన వచ్చింది. ఇక ఇంట్లో గంగవ్వను ఎవ్వరైనా ఏమైనా అంటే రచ్చ రచ్చే.. రాష్ట బంద్ చేస్తాం అంటూ అప్పుడే గంగవ్వ అభిమానులు మీమ్స్ చేస్తున్నారు. నాగార్జున కూడా ముందే ఆమెను ఎవరైనా ఏమైనా అన్నారంటే ఖచ్చితంగా వారు ట్రబుల్స్ లో పడ్డట్లే అంటూ హెచ్చరించాడు. నేటి నుండి గంగవ్వ షో ఎలా ఉంటుందో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పుడే గంగవ్వకు విన్నింగ్ అవకాశాలు ఎక్కవగా ఉన్నాయంటూ ప్రచారం మొదలు అయ్యింది. షో చూడక పోయినా కూడా నా ఓటు గంగవ్వకే అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.