Templates by BIGtheme NET
Home >> Cinema News >> మోహన్ బాబుతో సమస్యేంటి?

మోహన్ బాబుతో సమస్యేంటి?


తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. ఆయన్ని ఎవరితోనూ పోల్చలేం. ఆయనకు ఆయనే సాటి. అలాంటి నటుడు మరొకరు కనిపించరు. వెనుకటి తరంలో ఎస్వీఆర్కు సరి సమానమైన స్టేచర్ తెచ్చుకున్న నటుడు మోహన్ బాబు. విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమెడియన్ హీరో.. ఇలా ఏ పాత్ర వేసినా అందులో ఒదిగిపోగల నైపుణ్యం ఆయన సొంతం. ఇలా 500 సినిమాల్లో వివిధ రకాల పాత్రల్లో అద్భుతమైన అభినయంతో మోహన్ బాబు అలరించారు. మోహన్ బాబు నటన గురించి చెప్పాలంటే హిట్ సినిమాలే తీసుకోవాల్సన పని లేదు. ‘రాయలసీమ రామన్న చౌదరి’ లాంటి ఫ్లాప్ సినిమాలో ఆయన నటన చూస్తే ఎవ్వరైనా సలాం కొట్టాల్సిందే. అయితే ఒకప్పటి దర్శకులు మోహన్ బాబును భలేగా ఉపయోగించుకున్నారు కానీ.. 2000 తర్వాత వచ్చిన డైరెక్టర్లు మాత్రం ఆయన్ని సరిగా వాడుకోలేకపోయారు.

‘యమదొంగ’ ‘బుజ్జిగాడు’ లాంటి సినిమాల్లో మెరుపులు మినహాయిస్తే గత 15 ఏళ్లలో మోహన్ బాబు స్థాయికి తగ్గ సినిమాలే రాలేదు. ఆయనే సినిమాలు తగ్గించుకోవడం.. ఇప్పటి దర్శకులు కూడా ఆయన వైపు చూడకపోవడంతో మోహన్ బాబు లాంటి గొప్ప నటుడు ఖాళీగా ఉండిపోయాడు. సొంత బేనర్లో చేసిన సలీమ్ ఝుమ్మంది నాదం గాయత్రి లాంటి సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సరైన పాత్ర పడితే మోహన్ బాబు ఇప్పటికీ చెలరేగిపోగలరని అందరికీ తెలుసు. కానీ పెద్ద సినిమాల్లో ఆయన కనిపించడం లేదు. ఆయన్నెందుకు సంప్రదించట్లేదో.. మోహన్ బాబు ఎందుకు యాక్టివ్గా లేరో అర్థం కాదు. కొంత విరామం తర్వాత తమిళంలో సూర్య చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’తో పాటు మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లో మోహన్ బాబు మంచి పాత్రలే చేస్తున్నట్లున్నారు.

కానీ తెలుగులో మాత్రం ఆయన స్థాయికి తగ్గ సినిమాలు పాత్రలు రావట్లేదు. చివరికిప్పుడు రైటర్ టర్న్డ్ డైరెక్టర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేశారు. రైటర్గా రత్నబాబు చేసినవన్నీ మామూలు సినిమాలే. దర్శకుడిగా మారి ‘బుర్రకథ’ లాంటి పేలవమైన సినిమా తీశాడు. అలాంటి దర్శకుడితో మోహన్ బాబు హీరోగా సినిమా చేసి ఏం సాధిస్తారో? అసలు మంచు ఫ్యామిలీ అంటేనే.. ఇలా ద్వితీయ శ్రేణి దర్శకులు రచయితలకు పరిమితం అయిపోవాల్సి వస్తోంది. ఇండస్ట్రీకి వాళ్లు దూరంగా ఉంటున్నారో.. లేక ఇండస్ట్రీనే వాళ్లను దూరం పెడుతోందో అర్థం కాని పరిస్థితి. మంచు కుటుంబంలో మిగతా వాళ్ల సంగతేమో కానీ.. మోహన్ బాబు లాంటి లెజెండరీ నటుణ్ని మాత్రం తెలుగు ప్రేక్షకులు చాలా మిస్సవుతున్న మాట వాస్తవం.