పుష్ప రాజ్ ని ఢీ కొట్టే పాత్రలో ఎవరు నటిస్తున్నారు…?

0

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. ఈ నెల 6వ తేదీ నుంచి వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ చిత్రంలో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులను కూడా తీసుకోవాలని ‘పుష్ప’ టీమ్ భావించింది. ఆ మధ్య తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలకమైన రోల్ లో నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్నీ మారిపోయి విజయ్ సేతుపతి డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి ఈ పాత్రలో నటించే యాక్టర్స్ అంటూ అనేకమంది పేర్లు తెరపైకి వచ్చాయి.

తమిళ నటుడు బాబీ సింహాని ఆ రోల్ కోసం సుక్కు అండ్ టీమ్ సంప్రదిస్తున్నారని టాక్ నడిచింది. ఇదే క్రమంలో గతంలో బన్నీ ‘వరుడు’లో ప్రతినాయకుడిగా నటించిన హీరో ఆర్య పేరు కూడా వినిపించింది. అలానే నేషనల్ అవార్డు విన్నర్ సముద్రఖని ని తీసుకోవాలని ‘పుష్ప’ టీమ్ అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. దీంతో ఇప్పుడు పుష్ప రాజ్ ని ఢీ కొట్టే పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది సస్పెన్స్ గా మారింది. మొత్తం మీద శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీలో కోలీవుడ్ యాక్టర్స్ ని తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

కాగా ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ‘పుష్ప రాజ్’ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో మాసిన దుస్తులు.. గుబురు గడ్డం.. భిన్నమైన హెయిర్ స్టైల్ తో మొరటు కుర్రాడిగా ఉన్న బన్నీ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక పుష్ప రాజ్ కి జోడీగా గిరిజన యువతి పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా స్టెప్పులేయనుందని సమాచారం. సుకుమార్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీస్ మరియు ముత్యంశెట్టి మీడియా నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత బన్నీ నుంచి రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.