‘వకీల్ సాబ్’ కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సి వస్తుందా..?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు. పవన్ రీ ఎంట్రీగా వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కోవిడ్ నేపథ్యంలో తిరిగి ప్రారంభమైంది. అయితే ‘వకీల్ సాబ్’ విడుదలపై ఇంతవరకు క్లారిటీ రాలేదు.

ముందుగా ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారు. అదే సమయంలో కరోనా మహమ్మారి వచ్చి బ్రేక్స్ వేసింది. ఇప్పుడిప్పుడే థియేటర్స్ రీ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని వార్తలు వచ్చాయి. దిల్ రాజు కూడా ఈ చిత్రాన్ని పండక్కి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. కాకపోతే దిల్ రాజు చెప్పే రేట్లకి సినిమా తీసుకోడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదని టాక్ నడుస్తోంది. ఒకవేళ సొంతగా విడుదల చేసినా పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ‘వకీల్ సాబ్’ కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సి వస్తుందేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నిజానికి కరోనా మహమ్మారి కారణంగా స్టార్ హీరోల సినిమాల బిజినెస్ మీద కూడా గట్టిగా ప్రభావం చూపించింది. థియేటర్స్ రీ ఓపెన్ చేస్తున్నా ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారో రారో అనే అనుమానంతో డిస్ట్రిబ్యూటర్స్ మనీ పెట్టి పెద్ద సినిమాలను కొనాలంటే భయపడుతున్నారట. ఈ నేపథ్యంలో డిసెంబర్ 25న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రిలీజ్ కానుంది. దీని తర్వాత ఇండస్ట్రీలో ఏమైనా చేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా సక్సెస్ ని బట్టి రాబోయే సినిమాల బిజినెస్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.