ఈ మలయాళి ముద్దుగుమ్మ ఈసారైనా నిలదొక్కుకునేనా?

0

మలయాళి ముద్దుగుమ్మ మాళవిక నాయర్ తెలుగు ప్రేక్షకులకు నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో పరిచయం అయ్యింది. ఆ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. చిన్న వయసులోనే ఆమె నటనలో మెచ్యూర్టీ చూపించింది అంటూ అభినందనలు తెలియజేశారు. ఆ సినిమా తర్వాత ఖచ్చితంగా మాళవిక టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోతుందని ఆమెను స్టార్స్ అంతా కూడా తమ సినిమాల్లో నటింపజేసేందుకు పోటీ పడుతారు అంటూ భావించారు. తీరా చూస్తే ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు రావడమే గగణం అయ్యింది. ఆమె తెలుగులో చేసిన కళ్యాణ వైభోగమే సినిమా ఆమె కెరీర్ ను తలకిందులు చేసింది. మొదటి సినిమాతో వచ్చిన గుర్తింపు రెండవ సినిమా విడుదల తర్వాత ఆమెను అంతా లైట్ తీసుకున్నారు.

కళ్యాణ వైభోగమే సినిమా తర్వాత మహానటిలో చిన్న పాత్రలో కనిపించిన ఈమె మెగా అల్లుడు నటించిన ‘విజేత’ మూవీలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ట్యాక్సీవాల సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఆ సినిమాలో మాళవిక నటన మరోసారి ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా ఈమె రాజ్ తరుణ్ తో కలిసి ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలో నటించింది. లాక్ డౌన్ కు ముందు విడుదలకు రెడీ అయిన ఈ సినిమా ఆరు నెలల పాటు వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమాను ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు నేడు తీసుకు రాబోతున్నారు.

ఈ సినిమా థియేటర్లలో విడుదల అయితే అంతో ఇంతో గుర్తింపు వస్తుందని మరికొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగవచ్చు అని మాళవిక నాయర్ భావించింది. అయితే ఆహాలో విడుదల కాబోతున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. సినిమా ఎలా విడుదల అయినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే తప్పకుండా మంచి గుర్తింపు అయితే మాళవికకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈసారైనా తెలుగులో మాళవిక నిలదొక్కుకుని మరి కొన్నాళ్ల పాటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేనా చూడాలి.