నితిన్ ఆ బ్యూటీతో మరోసారి రొమాన్స్ చేయనున్నాడా..?

0

టాలీవుడ్ యువ హీరో నితిన్ – మేఘా ఆకాష్ కాంబినేషన్ లో ‘లై’ ‘చల్ మోహన రంగా’ వంటి సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ జోడీ కలవనుందని తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘లై’ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నితిన్ – మేఘా ఆకాష్ జోడీకి మంచి మార్కులే పడినప్పటీ సినిమా మాత్రం ప్లాప్ అని నిర్ణయించారు. ఇదే క్రమంలో ‘చల్ మోహన రంగా’ సినిమాతో మరోసారి ఈ కాంబో తెరపై కనువిందు చేసింది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీని అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి కో ప్రొడ్యూసింగ్ చేసారు. అయినప్పటికీ ఈ సినిమా కూడా పరాజయం పాలైంది. నితిన్ మేఘా తో కలిసి నటించిన రెండు సినిమాలు నిరాశపరచడంతో ప్లాప్ జోడీగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు మేఘా తో ఉన్న ఫ్రెండ్ షిప్ తో మళ్ళీ ఆమెకు ఛాన్స్ ఇస్తున్నాడట.

‘రంగ్ దే’ సినిమాని దాదాపు పూర్తి చేసిన నితిన్ ప్రస్తుతం ‘చెక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. థ్రిల్లింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ప్రియా ప్రకాష్ వారియర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన నితిన్ – రకుల్ – ప్రియా ప్రకాష్ వారియర్ లుక్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మూడో హీరోయిన్ గా మేఘా ఆకాష్ ని తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ మధ్యనే తిరిగి ప్రారంభమైన ‘చెక్’ షూటింగ్ లో మేఘా ఆకాష్ త్వరలోనే జాయిన్ అవ్వబోతుందని తెలిసింది. ఇదే కనుక నిజమైతే నితిన్ – మేఘా ఆకాష్ జోడీకి ఈ హ్యాట్రిక్ మూవీ అయినా హిట్ అందిస్తుందేమో చూడాలి.