యంగ్ డైరెక్టర్స్ పార్టీ మూడ్

0

తెలుగు చిత్రపరిశ్రమలో కొత్త రక్తం ఉరకలేస్తోంది. కొత్త కొత్త ఆలోచనలతో కొత్త తరహా చిత్రాలని అందిస్తూ ప్రపంచానికి తెలుగు సినిమా సత్తాని చాటుతోంది. నవతరం దర్శకులు అందించిన చిత్రాలతో తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. అలా తెలుగు సినిమాకు వన్నె తెచ్చిన దర్శకులంతా ఓ చోట కలిశారు. ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా టాలీవుడ్ యంగ్ బ్లడ్ ఒక్కతాటిపైకి చేరి ఏకంగా పార్టీనే చేసుకుంది.

`మహానటి`తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్… పెళ్లి చూపులుతో టాలెంటెడ్ అనిపించుకున్న తరుణ్ భాస్కర్… `అ!`తో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ… హృద్యమైన కథ `కేరాఫ్ కంచరపాలెం`తో వెంకటేష్ మహా.. `అర్జున్రెడ్డి`తో టాలీవుడ్ గేమ్ ఛేంజ్ చేసిన సందీప్రెడ్డి వంగ .. ఇలా టాలీవుడ్ యువ రక్తం ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా ఒక చోట కలుసుకున్నారు.

సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ఫిల్మ్ కోసం ఎదురుచూస్తున్నాడు. బాలీవుడ్ లో `అర్జున్రెడ్డి` చిత్రాన్ని `కబీర్సింగ్` పేరుతో రీమేక్ చేసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. షాహీద్ కపూర్ కెరీర్లోనే ఈ మూవీ 300 కోట్లు వసూళ్లని సాధించి రికార్డులు సృష్టించింది. ఈ మూవీ రిలీజ్ తరువాత సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్ చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సందీప్ రెడ్డి వంగ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మళ్లీ విజయ్ దేవరకొండనే నమ్ముకుంటాడా? లేక బాలీవుడ్ హీరోనే ఎంచుకుంటాడా అన్నది తెలియాల్సి వుంది.