Templates by BIGtheme NET
Home >> GADGETS >> కనిపించని కెమెరాలతో వహ్వా అనిపించే OnePlus కాన్సెప్ట్ ఫోన్.. ఎలా ఉందంటే?

కనిపించని కెమెరాలతో వహ్వా అనిపించే OnePlus కాన్సెప్ట్ ఫోన్.. ఎలా ఉందంటే?


వన్ ప్లస్ తన కాన్సెప్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ప్రపంచానికి పరిచయం చేసింది. అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న సీఈఎస్ 2020 ఈవెంట్లో దీన్ని మొదటిసారిగా ఆవిష్కరించారు. దీన్ని మెక్ లారెన్ సంస్థ భాగస్వామ్యంతో రూపొందించారు. అయితే ఈ ఫోన్ ధరను కానీ స్పెసిఫికేషన్లను కానీ వన్ ప్లస్ ఇంతవరకు వెల్లడించలేదు. అయినపప్పటికీ చూడగానే ప్రత్యేకంగా అనిపించే ఈ స్మార్ట్ ఫోన్ ను కాన్సెప్ట్ ఫోన్ అని ఎందుకు అన్నారు? ఇందులో ఉన్న ప్రత్యేకతలేంటి? వంటి అంశాలను తెలుసుకోవాలంటే కథనాన్ని పూర్తిగా చదవండి.

​కెమెరానే ప్రధాన ఆకర్షణ!

ఈ ఫోన్ లో ఉన్న ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. వెనకవైపు కనిపించీ కనిపించకుండా ఉన్న కెమెరాలే. ఫోన్ వెనకవైపు ఉన్న ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ కింద ఈ కెమెరాలను అమర్చారు. ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ ను ఉపయోగించిన మొదటి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తమదేనంటూ వన్ ప్లస్ ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ గ్లాస్ ఉపయోగం ఏంటంటే.. చూడటానికి వెనకవైపు కెమెరాలు లేనట్లే ఉంటాయి. కానీ కెమెరా ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ఈ గ్లాస్ పారదర్శకంగా మారిపోయి మీరు ఫొటోలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు కెమెరా యాప్ పై క్లిక్ చేయగానే ఆ యాప్ కంటే వేగంగా గ్లాస్ రంగు మారిపోతుందని వన్ ప్లస్ చెబుతోంది.

​ఈ గ్లాస్ ఉపయోగం ఇదే!

సరే ఈ ఫీచర్ ఉంటే ఉంది దీని వల్ల మాకు ఉపయోగం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పటికే స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ వెనకవైపు 3-4 కెమెరాలు అందించడం ప్రారంభించాయి. కొన్ని కంపెనీలు మరో అడుగు ముందుకేసి ఐదు కెమెరాలను కూడా అందిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ కెమెరాల సంఖ్య మరింత పెరిగితే వెనకవైపు కెమెరాల సంఖ్య పెరిగిపోయి స్మార్ట్ ఫోన్లు చూడటానికి కాస్త ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. అలాంటప్పుడు ఇటువంటి గ్లాసుల ద్వారా కెమెరాలు కనబడకుండా నిరోధించి ఫోన్ మరింత అందంగా కనిపించేలా చేయవచ్చు.

​పనితీరు కూడా అద్భుతమే!

ఈ స్మార్ట్ ఫోన్ వెనకభాగంలో ఉన్న ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ organic particlesను కలిగి ఉంటుంది. ఇవి శక్తికి స్పందించి మీరు ఈ గ్లాస్ ను పారదర్శకంగా లేదా తిరిగి సాధారణ స్థితికి మార్చడానికి ఉపయోగపడతాయి. దీంతో పాటు ఫొటోలు తీసేటప్పుడు లైటింగ్ చాలా ఎక్కువగా ఉంటే.. ఆ ప్రభావం ఫొటోలపై పడకుండా ఈ గ్లాస్ పోలరైజ్ చేస్తుంది. ఈ ఫోన్ కెమెరా యాప్ లో అందించిన ప్రో మోడ్, మీరు ఐఎస్ఓ తగ్గించడానికి, షట్టర్ ను పెంచడానికి ఉపయోగపడతాయి.

​స్పోర్ట్స్ కార్ ప్రేరణతో..

ఈ కాన్సెప్ట్ ఫోన్ ను మెక్ లారెన్ 720ఎస్ స్పైడర్ స్పోర్ట్స్ కారు ప్రేరణతో రూపొందించారు. దీని పైభాగంలో ఎలక్ట్రోక్రోమిక్ వంటి పదార్థాన్ని వాడారు. దీని కారణంగా దీన్ని పారదర్శకంగా, పారదర్శకంగా కాకుండా మార్చుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్ వెనకభాగంలో లెదర్ ప్యానెల్ ను అందించారు. మెక్ లారెన్ గుర్తింపు రంగు అయిన ఆరెంజ్ పాపాయా రంగులో ఈ ప్యానెల్ ఉండనుంది.

​భవిష్యత్తు కోసం ప్రయోగం!

స్మార్ట్ ఫోన్లు భవిష్యత్తులో ఎలా రూపు మార్చుకుంటాయని తెలిపే ప్రయోగరూపమే ఈ కాన్సెప్ట్ ఫోన్ అని వన్ ప్లస్ సీఈవో పీట్ లావు తెలిపారు. ప్రస్తుతం వన్ ప్లస్ వినియోగదారులకు అత్యంత ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తున్నామని, దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ ప్రయత్నమన్నారు. కెమెరాను కనిపించకుండా ఉంచడం కూడా డిజైన్ లో ఒక భాగమని ప్రస్తుతమున్న కెమెరా డిజైన్ కాకుండా వినియోగదారులకు కొత్తదనాన్ని పరిచయం చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.