Templates by BIGtheme NET
Home >> Telugu News >> ప్రధానిపై 900 కోట్ల దావా వేసిన ప్రజలు

ప్రధానిపై 900 కోట్ల దావా వేసిన ప్రజలు


ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజలే ఏకంగా ప్రధానిపై దావా వేసిన అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. సుమారు 500 మంది ప్రజలు కోర్టును ఆశ్రయించిన ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. ప్రధాని కారణంగా తమకు తీరని నష్టం జరిగిందని.. అందువల్ల తమకు భారీ మొత్తంలో నష్టపరిహారం ఇప్పించాలని బాధతులు కోర్టును కోరారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేసింది. కోట్ల మందిని రోడ్డున పడేసింది. లక్షలమందిని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. ఈ క్రమంలోనే కరోనా కాటు వల్ల సొంత వాళ్లను పోగొట్టుకున్న ప్రజలు ఇప్పుడు ఇటలీ ప్రధానిపై పడ్డారు.

ఇటలీ ప్రధాని గిసెప్పే కొంటేపై కోర్టులో తాజాగా ఇటలీ ప్రజలు దావా వేశారు. ఇందులో ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి రోబర్టో స్పెరాంజా లాంబార్డీ ప్రాంత గవర్నర్ అట్టిలియో ఫొంటావా పేర్లను కూడా చేర్చారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో వీరంతా విఫలమయ్యారని దావాలో ఆరోపించారు. వీరి నిర్లక్ష్యం కారణంగా అయినవాళ్లను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయానికి దేశ ప్రధాని ఆరోగ్యశాఖ మంత్రితోపాటు గవర్నర్ కూడా బాధ్యత వహించి.. నష్టపరిహారంగా 100 మిలియన్ యూరోలు (సుమారు రూ. 900కోట్లు) చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇటలీ దేశంలో కరోనా కారణంగా 70వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఐరోపా పరంగా కోవిడ్ మరణాల్లో ఇటలీ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఐదోస్థానంలో ఉంది.