Templates by BIGtheme NET
Home >> Telugu News >> ‘ఆలీబాబా’ను రౌండప్ చేసిన చైనా.. మాట తెచ్చిన చేటు!

‘ఆలీబాబా’ను రౌండప్ చేసిన చైనా.. మాట తెచ్చిన చేటు!


కాలు జారితే తీసుకోవచ్చు.. కానీ మాట జారితే తీసుకోలేం అన్న సామెత అందరికీ తెలిసిందే. అలాంటి ఒకే ఒక్క మాట బడా కార్పొరేట్ కంపెనీని ముప్పు తిప్పలు పెట్టి ముప్పై మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. లాక్కోలేని.. పీక్కోలేని కండీషన్లోకి నెట్టేసింది. ఇంతకీ ఎవరది? ఏమా కథ అంటే.. చైనా కార్పొరేటర్ కంపెనీల్లో అతిపెద్ద కంపెనీ ‘అలీబాబా’. దీని వ్యవస్థాపకుడు జాక్ మా. రాబోయే రోజుల్లో 37 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి డీల్తో తన యాంట్ గ్రూప్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుందని జాక్ మా ఎన్నో కలలు కన్నారు. కానీ.. అవన్నీ కల్లలయ్యాయి.

అక్టోబరు 24న షాంఘైలో చైనాకు చెందిన ఆర్థిక రాజకీయ వ్యవస్థల అత్యున్నత స్థాయి ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సదస్సులో జాక్ మాట్లాడుతూ… చైనాలోని రెగ్యులేటరీ సిస్టమ్ నవ కల్పన (ఇన్నోవేషన్)ను అణచివేస్తోందని వృద్ధికి ఊతమివ్వాలంటే తప్పనిసరిగా సంస్కరణలు జరగాలని అన్నారు. చైనా బ్యాంకులు ‘పాన్ షాప్’ మెంటాలిటీతో పని చేస్తున్నాయని అనేశారు.

జాక్ మాటలతో చైనీస్ రెగ్యులేటర్లు కమ్యూనిస్టు పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణ చర్యగా యాంట్ ఐపీఓను నవంబరులో సస్పెండ్ చేశాయి. షాంఘై హాంగ్ కాంగ్ మార్కెట్లలో ప్రవేశించడానికి రెండు రోజుల ముందు ఈ షాక్ ఇచ్చాయి. తాజాగా చైనా అధికారిక మీడియా జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం.. అలీబాబా గ్రూప్ గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ కంపెనీపై చైనాకు చెందిన స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ (ఎస్ఏఎంఆర్) దర్యాప్తు ప్రారంభించింది. ఎక్స్క్లూజివ్ డీలింగ్ అగ్రిమెంట్ అమలుపై కూడా దర్యాప్తు జరుగుతోంది.

జాక్ మాపై ఇంత తీవ్రంగా చైనా విరుచుకుపడటానికి మరొక కారణం కూడా ఉందట. స్టేట్ కౌన్సిల్ జనరల్ ఆఫీస్ జాక్ మా వ్యాఖ్యలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఈ నివేదికను చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తోపాటు ఇతర ఉన్నత స్థాయి నేతలకు సమర్పించింది. జాక్ మా వ్యాఖ్యలను అత్యధికులు వ్యతిరేకిస్తున్నట్లు ఈ నివేదిక చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో జాక్ మా నేతృత్వంలోని అన్ని కంపెనీలపైనా క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని అత్యున్నత స్థాయిలో ఆదేశాలు జారీ అయ్యాయని చెప్తున్నారు. ఈ పరిస్థితికి జాక్ మా వ్యాఖ్యలే కారణమనే అభిప్రాయం బలంగా వ్యకమవుతోంది.