కరోనా నుంచి రక్షణగా నిలుస్తున్న యాంటీబాడీలివే!

0

కరోనా పాజిటివ్ కేసులు లక్షలాదిగా నమోదు అవుతుండడంతో వ్యాక్సిన్ ను సిద్ధం చేసేందుకు అన్ని దేశాల శాస్త్రవేత్తలు ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని దేశాలు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలుపెట్టాయి. మన దేశంలో కూడా భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసే వ్యాక్సిన్ తో పాటు మొత్తం ఐదు వ్యాక్సిన్లు సిద్ధం అవుతున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ ముగించుకుని ప్రజల వరకు చేరేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. వ్యాక్సిన్లు తయారు చేస్తున్న సంస్థలు కచ్చితంగా ఫలానా సమయానికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లు వచ్చేలోగా కరోనాకు కాస్తయినా అడ్డుకట్టవేసేందుకు వైద్య నిపుణులు చర్యలు చేపడుతున్నారు. శరీరంలో యాంటీబాడీలు పెంచడం ద్వారా కరోనాను నివారించేందుకు దృష్టిపెట్టారు. శరీరంలోకి ప్రవేశించే వివిధ రకాల వైరస్ లతో పోరాడి రక్షణ కల్పించేవే యాంటీబాడీలు. రెండు రకాలైన ఇమ్యున్నో గ్లోబులిన్ యాంటీబాడీలు (ఐజీఎం) (ఐజీజీ ) ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. శరీరంలో వైరస్ ప్రవేశించిన మొదటి వారంలో ఐజీఎం యాంటీబాడీలు రక్షణ కల్పిస్తాయి. అయితే ఈ యాంటీబాడీలు ఉత్పత్తి అవడం మొదలయిందంటే శరీరంలోకి ఏదో వైరస్ ప్రవేశించినట్లు అర్థం.

శరీరంలో వ్యాధికారక వైరస్ ప్రవేశించిన మూడు వారాలకు ఐజీజీ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. అయితే ఈ యాంటీబాడీలు చాలా రోజుల పాటు శరీరంలోని రోగనిరోధక శక్తిని కాపాడతాయి. ఈ యాంటీబాడీలు శరీరంలో ఆలస్యంగా ఉత్పత్తి అయినా ఎంతో ప్రాధాన్యం కలిగినవి. ప్రస్తుతం కరోనా తీవ్రత పెరగడం వ్యాక్సిన్లు రావడానికి ఇంకా సమయం ఉండడంతో వైద్యులు పాజిటివ్ బారినపడ్డ వారికి శరీరంలో యాంటీబాడీలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. యాంటీబాడీలను సంఖ్యకు అనుగుణంగా చికిత్స అందజేస్తున్నారు. మన శరీరంలో ఈ రెండు రకాల యాంటీబాడీలు ఎంతమేర ఉన్నాయో తెలుసుకోవడం చాలా సులభం. కేవలం 500 రూపాయల ఖర్చుతో ల్యాబ్ లో పరీక్షలు చేయించుకొని అరగంటలో ఫలితాన్ని పొందవచ్చు.