Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఏపీ కేబినెట్ మార్పులు: అందరు మంత్రులు ఔట్ అంట?

ఏపీ కేబినెట్ మార్పులు: అందరు మంత్రులు ఔట్ అంట?


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి వర్గంలో ఇప్పుడు చోటు రాని వారు బాధపడవద్దని.. రెండున్నరేళ్లు పూర్తయిన తరువాత అందరికీ అవకాశం ఇస్తానని చెప్పారు. సీఎం చెప్పిన సమయం పూర్తయ్యింది. దీంతో మంత్రి వర్గ విస్తరణపై తీవ్ర చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు కేబినెట్ లో ఉన్న వారు తమ పదవి ఉంటుందో.. ఊడుతుందోనని ఆందోళన చెందుతుండగా.. కొత్త వారు తమకు అవకాశం వస్తుందని ఆశ పడుతున్నారు. ఏపీ కేబినెట్ ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన తరువాత మార్పులు ఉంటాయని కొందరు మంత్రులు ఇప్పటికే పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ కు దగ్గరి బంధువైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏపీ మంత్రివర్గంలో వందశాతం మార్పులుంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మంత్రి పదవి ఉన్నా.. ఊడినా సీఎం మాటకు కట్టుబడి ఉంటానన్నారు. మంత్రి వ్యాఖ్యలతో మిగతావారిలోనూ కేబినేట్ మార్పు కచ్చితంగా ఉంటుందని చర్చించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మరో రెండు నెలల్లో రెండున్నరేళ్లు పూర్తవుతుంది. అది పూర్తికాగానే ఇప్పుడో.. అప్పుడో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అనుకుంటున్నారు. అయితే కరోనా కారణంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో ఇప్పుడే ఉండదనే ఆలోచనలో ఉన్నారు. కానీ తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలతో మరోసారి దీనిపై చర్చ ప్రారంభమైంది.

కేబినెట్లో ఇప్పటి వరకుచోటు దక్కించుకున్నవారిలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే మంత్రిగా పదవులు చేపట్టిన కొద్ది రోజులకే కరోనా మహమ్మారి ఆవహించింది. దీంతో మంత్రులుగా తమ హోదాలో తమ నియోజకవర్గాల్లో పర్యటించింది తక్కవే. అంతేకాకుండా మంత్రి హోదాలో అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక తమకు మంత్రి పదవి అన్న పేరే గానీ సొంతంగా నియోజకవర్గ ప్రజలకే చేసిందేమీ లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల పాటు కరోనాతో కాలం గడిచిందని, దీంతో తమ పాలన ఎక్కడ కొనసాగించామని అంటున్నారు.

ఈ తరుణంలో తమ మంత్రి పదవి వెంటనే ఊడిపోతుందా? అని నిరాశ చెందుతున్నారు. అయితే మొన్నటి వరకు జగన్ అనుయాయులకు పదవి గురించి ఎలాంటి ఢోకా ఉండదని భావించారు. కానీ తాజాగా మంత్రి బాలినేని వ్యాఖ్యలతో ఇప్పుడు అందరిలోనూ ఆందోళన మొదలైంది. అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే మంత్రి వర్గ మార్పులు ఉంటాయని అంటున్నారు. కొందరు సీనియర్లను కేవలం పార్టీ కార్యక్రమాలకు పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి ద్వారా పార్టీ పటిష్టతను పెంచి వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు సీఎం జగన్ వ్యూహ రచన చేయనున్నట్లు చర్చించుకుంటున్నారు.

ఇదే తరుణంలో ఇప్పటి వరకు అవకాశం రాని వారికి మంత్రి వర్గంలో చోటు కల్పించి వారిని ప్రోత్సహించనున్నారు. అయితే ఇప్పటికిప్పుడు వంద శాతం మంత్రివర్గంలో మార్పులు చేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికల ముందు సీనియర్లను పార్టీకే పరిమితం చేయడం వల్ల కొందరు అసంతృప్తితో ఉండే అవకాశం ఉంటుందంటున్నారు. దీంతో పార్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉందంటున్నారు. అయితే జగన్ అలాంటి వారిని బుజ్జగించి వారిని కేవలం పార్టీ కార్యక్రమాలకే ఉపయోగించుకోనున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కేబినేట్లో చోటు దక్కని వారు ప్రస్తుతం ఆశతో ఎదురుచూస్తున్నారు. కొందరు కేబినేట్లో చోటు కల్పించాలని ఇప్పటి నుంచే పైరవీలు చేస్తున్నారు. మరికొందరు నేరుగా అధిష్టాన పెద్దలను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మొత్తంగా కొత్త మంత్రి వర్గంలో జగన్ ఎవరికి అవకాశం ఇస్తాడోననే ఉత్కంఠ నెలకొంది.