యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

ఆన్‌ లైన్‌ టిక్కెట్లు వల్ల ఎవరికీ లాభం? ఎవరికీ నష్టం?

0

ఏపీలో సినిమా టికెట్ల విక్రయం పై వివాదం రోజురోజుకు ముదురుతోంది. అసలు ఈ ఆన్‌ లైన్‌ టిక్కెట్ల విక్రయం వల్ల ఎవరికీ లాభం ? ఎవరికీ నష్టం ? ఎందుకు ప్రభుత్వం టికెట్ల రేట్లు విషయంలో అంతగా పట్టుదలగా ఉంది ? మరోపక్క ఆన్‌ లైన్‌ టిక్కెట్ల వచ్చేస్తే తమ జీవితాలు నాశనం అవుతాయని డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత నిక్కచ్చిగా ఉంది ? పవన్ కళ్యాణ్ చేపినట్లు.. ప్ర‌భుత్వ ఖ‌జానాలో డ‌బ్బుల్లేనందు వ‌ల్లే సినిమా టికెట్లు ప్ర‌భుత్వ‌మే విక్ర‌యిస్తోందా ? లేక, ప‌వ‌న్ సినిమాల‌ను ఆపేసి.. పవన్ కళ్యాణ్ ను ఆర్ధికంగా ఇబ్బందుల పాలు చేయాలని జగన్ భావిస్తున్నారా ? నిజాలు ఏమైనా.. ఏపీలో థియేటర్లు పరిస్థితి వల్ల దాదాపు 10 వేల మంది ఉపాధి కోల్పోయి బాధ పడుతున్నారు.

కానీ ప్రభుత్వం మాత్రం ప్రజలకు మేలు చేసేందుకే ఆన్‌ లైన్‌ టిక్కెట్ల విక్రయం తీసుకొచ్చామని చెబుతుంది. ఒక విధంగా ఆలోచిస్తే.. ప్రభుత్వ నిర్ణయం కూడా కరెక్టే. తమ అభిమాన హీరో చిత్రాన్ని తొలి రోజే చూడాలనే ఉత్సాహం అభిమానుల్లో విపరీతంగా ఉంటుంది. ఆ అభిమానం కోసం సినిమా టికెట్ ను రెట్టింపు రేటుకి కొంటాడు.

అయితే, ఈ అభిమానాన్ని ‘క్యాష్‌’ చేసుకోవాలనే అత్యాశతో కొంతమంది సినిమా వాళ్ళు పేదల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఆ మధ్య ఒక స్టార్ హీరో సినిమా ‘మార్నింగ్ షో’ టికెట్ సగటున 500 /-కి అమ్మారు. ఇలాంటి దోపిడీలు ప్రతి స్టార్ హీరో సినిమాకి జరుగుతూనే ఉన్నాయి. అభిమానుల బలహీనతను సొమ్ము చేసుకోవడానికి సినిమా రిలీజ్ అయిన మొదటి రెండు రోజులు టికెట్ రేట్ ను నాలుగైదు రెట్లు పెంచుతున్నారు.

ఈ విషయంలో ఇప్పటికే ప్రేక్షకులు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఈ పరిస్థితుల్లోనే ఏపీ ప్రభుత్వం ఎవరి సినిమా అయినా.. ఏ రోజైనా.. టికెట్‌ ధర మాత్రం ఒకేలా ఉండాలని, సామాన్య ప్రజలను దోపిడీకి గురి కాకుండా ఉండటమే తమ ప్రభుత్వం ఉద్దేశంగా జగన్ ప్రభుత్వం చెబుతోంది.

సరే.. ప్రభుత్వం అభిప్రాయం ఎలా ఉన్నా.. ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశామని, నటీ నటులకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నామని.. లేక తమ సినిమా పాన్ ఇండియా సినిమా అని ఇష్టమొచ్చినట్లు టికెట్ల రేట్లు పెంచుకుంటూ పోతే ఎలా ? కచ్చితంగా ఇది తప్పే.

ఇలాంటి అదనపు దోపిడీలను నిరోధించడానికి ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే తప్పదు. అయితే, సినిమా ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితులను కూడా జగన్ ప్రభుత్వం ఆలోచించాలి. కరోనా కారణంగా ఇప్పటికే సినిమా పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఇలాంటి సమయంలో పరిశ్రమను ఆదుకోవాల్సింది పోయి.. పరిశ్రమకు నష్టం తెచ్చే విధానాలను ప్రవేశ పెడితే పరిశ్రమ ఎలా బతుకుతుంది ?

అయినా, ప్రైవేట్ వ్యక్తులైన నిర్మాతలు తీసే చిత్రాలను ప్రభుత్వం ఎలా అమ్ముకుంటుంది ? ఎలాగూ రైతు పండించే పంటను ఎంత రేటుకి అమ్మాలి అనే విషయంలో ఆ రైతుకి హక్కు లేకుండా చేశారు. ఇప్పుడు నిర్మాతలు తీసే సినిమాలను అమ్ముకోవడానికి ఆ నిర్మాతలకు స్వేచ్చ లేకుండా చేస్తారా ?

టికెట్ రెట్టింపు రేట్ల విషయంలో ఆంక్షలు పెట్టండి, అంతేగాని ఎవరో సినిమాని ఇంకెవరో అమ్ముకోవడం, దాన్ని ప్రభుత్వమే అమలు పరచడం మంచి అనిపించుకోదు. అయినా డబ్బులు పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు ప్రైవేట్ కాంట్రాక్టర్లు బిల్లుల కోసం వేచిచూసినట్టు వారి టికెట్ల డబ్బుల కోసం ప్రభుత్వం ముందు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి వస్తే.. ఇక ఎవరు మాత్రం ఎందుకు సినిమాలు తీస్తారు. ఇప్పటికైనా ఈ విషయంలో జగన్ ప్రభుత్వం ఆలోచించాలి.