అక్రమ ఆస్తుల్ని సరి చేసుకోవటానికే కేసీఆర్ అలా చేస్తున్నారట!

0

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పగ్గాల్నిబండి సంజయ్ కు ఇచ్చిన నాటి నుంచి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించిన వారంతా విమర్శ చేసే వేళలో.. ఆచితూచి అన్నట్లుగా విమర్శలు చేసే వారు. ఆరోపణల విషయానికి వస్తే మరింత జాగ్రత్తగా ఉండేవారు. అందుకు భిన్నంగా బండి మాత్రం తరచూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు తరచూ సంచలనంగా మారుతున్నాయని చెప్పక తప్పదు.

కాకుంటే.. కేసీఆర్ లాంటి అధినేత మీద అవినీతి ఆరోపణలు చేసే సమయంలో కాస్తంత కసరత్తు చేయటం.. అందుకు సంబంధించిన ఆధారాల్ని చెప్పటం అన్నది తప్పనిసరి. అందుకు భిన్నంగా తనకు తోచింది బండి అనేస్తున్నారన్న మాట తరచూ వినిపిస్తోంది. తాజాగా ఆ కోవకు చెందిన వ్యాఖ్యల్ని చేయటం గమనార్హం. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటైన ఆరోపణలు చేశారు బండి.

ఇటీవల కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన ఎల్ ఆర్ ఎస్ స్కీంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి తన అక్రమ ఆస్తుల్ని క్రమబద్దీకరించేందుకే ఎల్ ఆర్ ఎస్ ను తీసుకొచ్చినట్లుగా పేర్కొన్నారు. తెల్ల పాస్ బుక్కులను నల్ల పాస్ బుక్కులుగా మార్చటం తప్పించి.. ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

అసెంబ్లీ సాక్షిగా నిజాంను పొగడటం సరికాదన్న ఆయన.. 2023లో తాము అధికారంలోకి రాగానే.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మరీ.. తరహా వ్యాఖ్యలకే ఓట్లు రాలతాయా? అన్నది సందేహంగా చెప్పక తప్పదు. సీఎం కేసీఆర్ మీద ఇంత ఘాటైన ఆరోపణలు చేసే వేళలో ఆయన అక్రమఆస్తుల జాబితాను బయటపెట్టటం లాంటివి చేయాలి కదా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.