ఏపీ దివాలా తీసింది.. కేంద్రానికి బీజేపీ ఎంపీ లేఖ!

0

ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సురేశ్ ప్రభు  కేంద్రానికి రాసిన ఓ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఏన్డీఏ వైసీపీ మిత్రపక్షాలు కాకపోయినా.. ప్రతి దశలోనూ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ ఉంటాయి. లోక్సభ రాజ్యసభల్లో బిల్లులు పాస్ కావడానికి వైసీపీ కేంద్రానికి సహకరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా సురేశ్ ప్రభు ఏపీలో ఆర్థికపరిస్థితి ఏమీ బాగాలేదని.. సీఎం జగన్ కార్పొరేషన్ నిధులను దారిమళ్లిస్తున్నారని కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖ ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది.

జగన్ నిర్ణయాలతో ఏపీ ఆర్థికపరిస్థితి దిగజారిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్కు ఆయన లేఖలు రాశారు. జగన్మోహన్ రెడ్డి.. 56 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి నిధులను సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటిమరీ సంక్షేమ పథకాల కోసం ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుందన్నారు. 2005 నాటి ఎఫ్ఆర్బీఎం చట్టంలో సవరణలు చేసే బిల్లుకు మంగళవారం అసెంబ్లీ ఆమోదం తెలిపిన కొద్ది గంటలకే బీజేపీ ఎంపీ సురేశ్ ప్రభు కేంద్రానికి లేఖ రాయడం సంచలనం రేపుతున్నది.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్ఆర్బీఎం పరిమితులపై రాష్ట్రాలకు సడలింపు లభించడంతో.. ఇప్పటివరకూ ఉన్న 3 శాతం అప్పుల పరిమితిని 5శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసింది. బిల్లు పాసైన రోజే బీజేపీ మెలిక లేఖలు రాయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే సురేశ్ ప్రభు లేఖపై ఇంకా వైసీపీ స్పందించలేదు.