హైదరాబాద్ మెట్రో రైల్ టైమింగ్స్ మారాయి.. అవేమంటే?

0

లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ ను నిలిపివేయటం.. అన్ లాక్ లో భాగంగా మెట్రో సేవల్ని పునరుద్దరించటం తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత తిరిగి పట్టాలెక్కిన మెట్రో రైల్ ను పరిమితంగానే నడిపారు. అంతకంతకూ పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయాల్ని తీసుకుంది హైదరాబాద్ మెట్రో రైల్. ఇప్పటివరకు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమవుతున్న హైదరాబాద్ మెట్రో సేవలు.. లాక్ డౌన్ ముందు మాదిరి ఉదయం ఆరున్నర నుంచి ప్రారంభం కానున్నాయి.

అంతేకాదు.. రాత్రి9.30 గంటల వరకు సేవలు అందిస్తారు. లాక్ డౌన్ తర్వాత పట్టాలెక్కిన మెట్రో రైల్ ను కొన్ని స్టేషన్లలో ఆపని సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పటివరకు ఆగకుండా వెళుతునన భరత్ నగర్.. గాంధీ ఆసుపత్రి.. ముషీరాబాద్ మెట్రో స్టేషన్లలో ఈ రోజు నుంచి మెట్రో రైళ్లను నిలపాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రయాణికుల నుంచి స్పందన బాగుందని.. రద్దీ అంతకంతకూ పెరుగుతున్నట్లుగా హైదరాబాద్ మెట్రో వెల్లడించింది. అంతేకాదు.. ప్రతి మూడు నిమిషాలకు ఒక ట్రైన్ ను నడుపుతున్నట్లుగా వెల్లడించారు.గతంలో మాదిరి మెట్రోను రాత్రి పదకొండు గంటల వరకు తిప్పితే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే.. ఈ విషయం మీద మాత్రం మెట్రో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు.