సెప్టెంబర్ 1… అన్ లాకింగ్ పూర్తి

0

Coronavirus India unlocking

Coronavirus India unlocking

ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా అన్ని దేశాలతో పాటు భారత్ కూడా పూర్తిగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే… మునుపటి కంటే కూడా దేశంలో ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా ఈ వైరస్ కారణంగా చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతున్నా కూడా దేశంలో అప్పుడే అన్ లాకింగ్ ప్ర్రక్రియ మొదలైపోయిన విషయం కూడా తెలిసిందే. తాజాగా త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తోందన్న వాదనల నేపథ్యంలో జనంలో అంతగా భయాందోళనలు కనిపించడం లేదు. ఇదే అదనుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు… అన్ లాకింగ్ ప్రక్రియను పూర్తి చేసేసి… లాక్ డౌన్ కు చెల్లు చీటి ఇవ్వనుందా? అన్న దిశగా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే లాక్ డౌన్ ను విడతలవారీగా తగ్గిస్తూ వచ్చిన కేంద్రం… ఇప్పటికే అన్ లాక్ ప్రక్రియను మూడు దశలుగా అమలు చేసింది. ఇందులో భాగంగా సినిమా హాళ్లు పార్కులు విద్యా సంస్థలు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు వంటి జనసమ్మర్ధ ప్రాంతాలకు మినహా మిగిలిన అన్నింటికీ లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చేసింది. అంతేకాకుండా వచ్చే నెలలో విద్యా సంస్థల పున:ప్రారంభానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా కేంద్రం వరుస ప్రకటనలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో సెప్టెంబర్ 1న లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేసి… అన్ లాక్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అంటే… సెప్టెంబర్ 1న కేంద్రం నుంచి విడుదలయ్యే ప్రకటనలో దేశంలోని అన్ని రకాల కార్యకలాపాలు మొదలైపోయినట్టేనన్న మాట ఆసక్తి రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 5 నుంచి విద్యా సంస్థలన్నీ ఓపెన్ కానున్నాయన్న వార్తలు ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తుండగా… సెప్టెంబర్ 1 నుంచే సినిమా థియేటర్లు పార్కులు ఇతరత్రా అన్నీ కూడా ఓపెన్ కానున్నాయనే చెప్పక తప్పదు. మొత్తంగా సెప్టెంబర్ 1న కేంద్రం నుంచి రానున్న ప్రకటన దేశంలో అన్ లాక్ ను పూర్తి చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే… లాక్ డౌన్ దేశంలో పూర్తిగా ఎత్తేసినట్టేనన్న మాట.