బైడెన్ కు లైన్ క్లియర్.. అధికార మార్పిడికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్

0

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్ అధికార మార్పిడికి కొద్దిరోజులుగా పేచీ పెడుతున్న సంగతి తెలిసిందే. కోర్టుల్లో కేసులు కూడా వేస్తున్నాడు. ఈ క్రమంలోనే జనవరిలో కొత్త అధ్యక్షుడి బాధ్యతల నియామకానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

ఈ క్రమంలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. జోబైడెన్ కు బాధ్యతలు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికార మార్పిడికి అవసరమైన ప్రక్రియను ప్రారంభించాలని అధికార యంత్రాగానికి సూచించారు.

తాజాగా ట్రంప్ ట్వీట్ చేశారు. ‘దేశం పట్ల ఉన్న నిబద్ధత విధేయతకు జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్ఏ) చీఫ్ ఎమిలీ ముర్ఫీకి ధన్యవాదాలు. కొద్దిరోజులుగా ఆమె వేధింపులకు బెదిరింపులకు గురవుతున్నారు. దేశ ప్రయోజనాల రీత్యా నిబంధనల ప్రకారం అధికార మార్పిడికి అనుసరించాల్సిన ప్రక్రియను ప్రారంభించాలని ఎమిలీని కోరుతున్నారు.’ అని ట్రంప్ పేర్కొన్నారు.

ఇక ట్రంప్ మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఎన్నికల్లో అవకతవకలపై తన న్యాయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ వైట్ హౌస్ను వీడేందుకు మొండికేస్తే అనుసరించాల్సిన ప్రక్రియపై నిన్నటిదాకా సర్వత్రా చర్చ జరిగింది. ట్రంప్ తాజా ప్రకటనతో ఇక బైడెన్కు అధికారం కట్టబెట్టేందుకు అడ్డంకులు తొలగిపోయాయి.

అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జోబైడెన్ కు జీఎస్ఏ చీఫ్ ఎమిలీ ముర్ఫీ లేఖ రాశారు. అధికార మార్పిడి ప్రక్రియను షూరూ చేసేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉందని అందులో పేర్కొన్నారు. ఈ లేఖ బైడెన్ కు చేరిన కొద్ది గంటలకే ట్రంప్ ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటన చేశారు.

ట్రంప్ తాజా ప్రకటనతో బైడెన్ అధికారాన్ని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ 306 ఎలక్టోరల్ ఓట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడురిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ 232 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు.